నేటి నుంచి కార్తీక వైభవం.. దీపాల విశిష్ఠత, ఎన్ని వత్తులు ఉండాలో తెలుసా?
శివకేశవులకు ప్రీతికరమైన కార్తీకమాసం నేడు ప్రారంభం కానుంది. 'న కార్తీక నమో మాసః న దేవం కేశవాత్పరం! నచవేద సమం శాస్త్రం!! న తీర్థం గంగాయాస్థమమ్' అని స్కంద పురాణంలో ఉంది.
By - అంజి |
నేటి నుంచి కార్తీక వైభవం.. దీపాల విశిష్ఠత, ఎన్ని వత్తులు ఉండాలో తెలుసా?
శివకేశవులకు ప్రీతికరమైన కార్తీకమాసం నేడు ప్రారంభం కానుంది. 'న కార్తీక నమో మాసః న దేవం కేశవాత్పరం! నచవేద సమం శాస్త్రం!! న తీర్థం గంగాయాస్థమమ్' అని స్కంద పురాణంలో ఉంది. అంటే కార్తీకానికి సమానమైన మాసము, కేశవుడికి సమానమైన దేవుడు, వేదముతో సమానమైన శాస్త్రం, గంగతో సమానమైన తీర్థమ లేదు అని అర్థం. ఈ మాసంలో చేసే పూజలు, వ్రతాలు, ఉపవాసాలు ఎంతో శుభప్రదమైనవి. ఈ నెలలో పరమేశ్వరుడిని విశేషమైన భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. మిగతా మాసాలతో పోలిస్తే ఈ కార్తీక మాసం ఎంతో పవిత్రమైనదని స్కంద పురాణంలో ఉంది.
కార్తీక మాసంలో సూర్యుడు తుల - వృశ్చిక రాశుల్లో, చంద్రుడు కృత్తికా నక్షత్రంలో సంచరిస్తాడు. దీంతో సూర్యకాంతి తగ్గుతుంది. సూర్యాస్తమయం తర్వగా అవుతూ చీకటి దట్టంగా ఉంటుంది. అప్పుడు మన శరీరము కాస్త బద్దకిస్తుంది. చీకట్లను పారదోలడంతో పాటు మన శక్తి పుంజుకునేందుకు దీపాలను వెలిగించాలని పండితులు చెబుతున్నారు. ఉదయం నెయ్యితో, సాయంత్రం నువ్వుల నూనెతో వెలిగించడం శుభప్రదమంటున్నారు.
కార్తీకమాసం: ప్రమిదల్లో ఎన్ని వత్తులు ఉండాలి?
కార్తీక మాసంలో ప్రమిదలో రెండు వత్తులను వెలిగిస్తే శాంతి లభిస్తుందని పండితులు చెబుతున్నారు. 3 వత్తులు ధనవృద్ధినీ, నాలుగు ఐశ్వర్యాన్నీ, ఐదు అఖండ సంపదల్నీ, ఏడు మోక్షాన్ని ప్రసాదిస్తాయంటున్నారు. మనలో ఉండే పంచతత్వాలకు నిదర్శనంగా 5 రుచులతో ఉండే ఉసిరికపైనా దీపాన్ని వెలిగించవచ్చని పేర్కొంటున్నారు. అయితే ఒక వత్తిని వెలిగించినా పుణ్యం లభిస్తుందని వివరిస్తున్నారు.
కార్తీకం: ఆకాశం దీపం అంటే తెలుసా?
కార్తీక మాసంలో దేవాలయాల్లో ధ్వజ స్తంభానికి ఆకాశం దీపం ఏర్పాటు చేస్తారు. చిన్న రంధ్రాలున్న ఓ గుండ్రని ఇత్తడి పాత్రలో నూనెపోసి ఈ దీపాన్ని వెలిగిస్తారు. ఇంటి దగ్గర తులసికోట పక్కన పొడవైన కొయ్యదీప స్తంభానికి దీపాన్ని వెలిగిస్తారు. దీన్ని వెలిగించడం వల్ల అపార జ్ఞానం సిద్ధిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి. ఆకాశ దీపం పితృదేవతలకు దారి చూపుతుందని, దీని వల్ల వారు దివ్యలోకాలను పొందుతారని వివరిస్తున్నాయి.