పవిత్ర కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి పర్వదినాన దీపాలు పెట్టేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలని పండితులు సూచిస్తున్నారు. చీకటి పడక ముందే దీపాలను వెలిగించాలని చెబుతున్నారు. సూర్యుడు అస్తమించకముందే దీపాలు వెలిగిస్తే.. ఆ సూర్య కిరణాల శక్తి దీపకాంతుల్లో నిక్షిప్తమై ఇంటికి సానుకూల ఫలితాలను ఇస్తుందని అంటున్నారు. అయితే తులసి పూజ చేసిన తర్వాత దీపారాధన చేస్తే శుభ ఫలితాలు ఉంటాయని నమ్మకం.
ఉసిరి దీపం ఎందుకు పెడతారు?
ఉసిరి చెట్టు అంటే శివ స్వరూపం. అందుకే కార్తీక మాసంలో దానికి పూజలు చేస్తారు. దీని కింద దీపం పెడితే సకల కష్టాలు, నవగ్రహ దోషాలు తొలగిపోతాయని శివ పురాణం చెబుతోంది. కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి దీపం పెడితే విష్ణువు అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. ఉసిరికాయ లక్ష్మీదేవీ ప్రతిరూపం కాబట్టి.. ఈ దీపం వెలిగించిన వారికి లక్ష్మీదేవీ ఆర్థిక బాధలన్నీ తొలగిస్తుందని ప్రగాఢ విశ్వాసం. ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం శుభప్రదం.
ఉసిరి దీపాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే?
కార్తీక మాసంలో ఉసిరి దీపం పెట్టడం అత్యంత పవిత్రమైన ఆచారం. ఈ దీపాన్ని వెలిగించడానికి గుండ్రని ఉసిరికాయను తీసుకుని, దాని మధ్య భాగంలో గుండ్రంగా కట్ చేయాలి. ఆ భాగంలో స్వచ్ఛమైన నూనె లేదా ఆవు నెయ్యి వేయాలి. ఆ నూనెలో వత్తి వేసి వెలగించాలి. ఇలా ఉసిరి దీపాన్ని వెలిగించడం వల్ల సకల దేవతల అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని పురణాలు చెబుతున్నాయి.