నేటితో కార్తీకమాసం ముగియనుంది. కార్తీక అమావాస్య తర్వాత రోజున పోలి పాడ్యమిని జరుపుతారు. ఈ సారి అది శుక్రవారం వస్తోంది. కార్తీక వ్రతం అచరించినవారు ఆ పుణ్యాన్ని రెట్టింపు చేసుకోవడానికి ఆవు నెయ్యితో వెలిగించిన 31 వత్తుల దీపాలను అరటి దొప్పలలో పెట్టి నదీ జలాల్లో నిమజ్జనం చేస్తారు. ఇలా చేస్తే కుటుంబంలో దారిద్ర్యం తొలగిపోతుందని నమ్మకం.
పోలి పాడ్యమిని నవంబర్ 21 తేదీన(శుక్రవారం) జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. పాడ్యమి తిథి నవంబర్ 20 ఉదయం 10.30 కి ప్రారంభమై నవంబర్ 21 మధ్యాహ్నం 12.45 వరకు ఉంటుంది. సూర్యోదయాన్ని పరిగణనలోకి తీసుకుని నవంబర్ 21నే పోలి పాడ్యమి నిర్వహించాలి. ఇక నవంబర్ 22, 2025 శనివారం తెల్లవారుజామున 4.35 నుంచి 6.00 గంటల వరకు దీపాలను నీటిలో వదలడానికి అనుకూల సమయం అని పండితులు చెబుతున్నారు.
పోలి పాడ్యమి రోజున నిష్ఠతో దీపారాధన చేసి, పోలి స్వర్గం కథను శ్రద్ధగా వింటే శుభ ఫలితాలు కలుగుతాయట. ఈ ఒక్క రోజు పూజతో కార్తీక మాసం మొత్తం దీపారాధన చేసినంత పుణ్యం సిద్ధిస్తుంది. స్వర్గప్రాప్తి మార్గం సుగమం అవుతుంది. మానసిక శాంతి, ఆధ్యాత్మిక అభివృద్ధి కలుగుతాయి. కుటుంబంలో సౌఖ్యం, సమృద్ధి పెరిగి, లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది.