హిందూ సంప్రదాయం ప్రకారం.. శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజిస్తే సకల సంపదలు సిద్ధిస్తాయని నమ్మకం. అందులోనూ శ్రావణ శుక్రవారం రోజు చేసే లక్ష్మీ పూజ అధిక ఫలాన్ని ఇస్తుందని చెబుతుంటారు. లక్ష్మీదేవి ఆరాధనకు శ్రావణ మాసం మొత్తం శ్రేష్ఠమైనదని పండితులంటున్నారు. అమ్మవారికి భారీగా పూజా ఏర్పాట్లు, రకరకాల ప్రసాదాలు అలంకారాలు చేయాలా? అంటే స్థోమత లేని వారు ఏమీ చేయక్కర్లేదు. భక్తితో ఇంట్లోని అమ్మవారి పటానికి పసుపు, కుంకుమ పెట్టి దీపారాధన చేయండి. నాలుగు పూలతో అర్చించండి. అమ్మవారి శ్లోకాలు చదువుకోండి. బెల్లంముక్క, పంచదారైనా నివేదించవచ్చు.
ఏదైనా శ్రద్ధతో చేయాలని పండితులు సూచిస్తున్నారు. ఇవాళ్టి నుంచి పవిత్రమైన శ్రావణ మాసం ప్రారంభమైంది. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈ మాసంలో తిథులతో సంబంధం లేకుండా పూజలు, పండుగలు చేస్తారు. ఈ సమయంలో సాత్విక ఆహారం (మాంసం, మద్యం కాకుండా) తీసుకోవాలని పండితులు చెబుతారు. దాన ధర్మాలు, ప్రతి రోజూ దైవారాధన చేయడం ప్రయోజనకరమని అంటున్నారు. ఈ మాసంలోనే నాగుల పంచమి, వరలక్ష్మీ వ్రతం, రాఖీ పౌర్ణమి, కృష్ణాష్టమి, పోలాల అమావాస్య వంటి పండుగలు ఉంటాయి.