Bhadrachalam Sri RamaNavami : శ్రీసీతారాముల కల్యాణము చూతము రారండి
గురువారం మధ్యాహ్నం 12 గంటలకు పునర్వసు నక్షత్రం అభిజిత్ లగ్న సుముహూర్తాన రాములోరి కల్యాణ మహోత్సవం జరగనుంది
By తోట వంశీ కుమార్ Published on 30 March 2023 2:33 AM GMTశ్రీసీతారాముల కల్యాణము చూతము రారండి
రఘువంశ రామయ్య, సుగుణాల సీతమ్మ, వరమాలకై వేచు సమయాన.. శివ ధనసు విరిచాక, వధువు మది గెలిచాకే మోగింది కల్యాణ శుభ వీణ. వరుడు రామయ్యగా వధువు సీతమ్మగా కనువిందు చేయగ, కనులు తరించేను, మనసులు పులకించేను, ఆ శుభ ఘడియలకు భద్రాద్రి ముస్తాబైంది. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు పునర్వసు నక్షత్రం అభిజిత్ లగ్న సుముహూర్తాన రాములోరి కల్యాణ మహోత్సవం జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు పువ్వాడ అజయ్, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిలు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
శ్రీరామనవమి వేడుకలకు సర్వం సిద్దమైంది. స్వామి వారి కల్యాణాన్ని వీక్షించేందుకు ఇప్పటికే పెద్ద ఎత్తున భక్తులు భద్రాచలం తరలివచ్చారు. గోటి తలంబ్రాలు, ముత్యాలు ఇలా ఎవరికి తోచిన విధంగా వారు తెస్తూ స్వామి వారి కల్యాణ మహోత్సవంలో భాగస్వాములు అవుతున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. వేసవి కాలం కావడంతో షామియానాలు, చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు.
ఉదయం 10 గంట నుంచి స్వామి వారి కల్యాణ తంతు ప్రారంభం కానుంది. పెండ్లికొడుకుగా రాములోరిని, సీతమ్మతల్లిని పెండ్లికూతురుగా ముస్తాబు చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు కల్యాణం జరగనుంది. స్వామి వారి పెళ్లిని చూసేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఇప్పటికే భక్తులు భద్రాద్రి చేరుకున్నారు. భద్రాచలంలో జరిగే కల్యాణాన్ని ప్రత్యక్ష ప్రసారాల ద్వారా కోట్లాది మంది వీక్షిస్తారు.
ముత్యాల తలంబ్రాలకు ఎంతో ప్రత్యేకత..
రాములోరి కల్యాణంలో ముత్యాల తలంబ్రాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. వీటిని తీసుకునేందుకు భక్తులు అమితాసక్తి కనబర్చుతుంటారు. తానీషా కాలం నుంచి ఆచారంగా వస్తున్న ముత్యాల తలంబ్రాలను ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. గులాల్ అనే రంగును కలపడంతో ఇవి ఎరుపు రంగులో ఉంటాయి. తలంబ్రాల వేడుక అనంతరం బ్రహ్మ బంధనం వేస్తారు. దీన్ని బ్రహ్మముడి అంటారు.
పకడ్బందీగా బందోబస్తు..
రాములోరి కల్యాణ మహోత్సవం, పుష్కర మహాపట్టాభిషేక వేడుకల నేపథ్యంలో పోలీస్‌శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీ డాక్టర్ వినీత్ ఆధ్వర్యంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు రంగంలోకి దిగి 6వేల మంది సిబ్బందితో కలిసి శాంతి భద్రతలను పర్యవేక్షించనున్నారు. భక్తుల సమస్యలను పరిష్కరించేందుకు సెక్టార్ల వారీగా తహసీల్దార్లు నియమితులయ్యారు. ట్రాఫిక్ సమస్యల నివారణకు రూట్ మ్యాప్‌లు ఏర్పాటు చేశారు.