మంగళగౌరీ వ్రతం ఆచరిస్తున్నారా?.. శ్రావణ మంగళగౌరీ వ్రత విశిష్టత ఇదే!
శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాల్లో మంగళ గౌరిని పూజించాలని పండితులు చెబుతున్నారు.
By అంజి
మంగళగౌరీ వ్రతం ఆచరిస్తున్నారా?.. శ్రావణ మంగళగౌరీ వ్రత విశిష్టత ఇదే!
శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాల్లో మంగళ గౌరిని పూజించాలని పండితులు చెబుతున్నారు. పార్వతీ దేవికి మరో పేరు గౌరీ దేవి. శ్రావణ మంగళవారం రోజున మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళల సౌభాగ్యం కలకాలం నిలుస్తుందని ప్రతీతి. కొత్తగా వివాహం అయిన వారు ఆ సంవత్సరంలో ప్రథమంగా వచ్చే శ్రావణ మంగళవారం నాడు మంగళ గౌరిని పూజించి, ముత్తైదువులకు వాయనం ఇస్తారు. ఇలా ఐదు సంవత్సరాలు వ్రతం ఆచరించాక, ఉద్యాపన చేస్తారు. ఈ వ్రతాన్ని గురించి స్వయంగా శ్రీకృష్ణుడే ద్రౌపదికి వివరించినట్టు పురాణాలు పేర్కొన్నాయి.
మొదటిసారిగా మంగళ గౌరీ వ్రతం ఆచరిస్తున్నవారు తల్లి పక్కనే ఉండి వ్రతం ఆచరించడం శ్రేష్టమని పండితులు చెబుతున్నారు. తొలి వాయనాన్ని తల్లికి ఇవ్వడమే మంచిదంటున్నారు. వ్రతాన్ని ఆచరించే వారు తప్పనిసరిగా కాళ్లకు పారాణి పెట్టుకోవాలి. వ్రతాన్ని ఆచరించేముందు రోజు, వ్రతం రోజు దాంపత్య సుఖానికి దూరంగా ఉండాలి. వ్రతం పాటించే రోజు రాత్రి ఉపవాసం ఉండాలి. ఐదు మంది ముత్తైదువులను పేరంటానికి పిలిచి వాయనాలు ఇవ్వాలి. నెలలో వచ్చే అన్ని వారాల్లోనూ ఒకే మంగళగౌరి విగ్రహాన్ని పూజించాలి. వినాయక చవితి తర్వాత వినాయకుడితో పాటు అమ్మవారినీ నిమజ్జనం చేయాలి. పూజకు గరికె, తంగేడుపూలు, ఉత్తరేణి తప్పనిసరిగా వాడాలి.