ఖేల్ ఖతమ్.. దుకాణం బంద్..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 26 Nov 2019 4:40 PM ISTమహారాష్ట్ర: సీఎం పదవికి దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేశారు. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ రాజీనామ చేసిన కొన్ని గంటల్లోనే ఫడ్నవీస్ తన పదవికి రాజీనామా చేశారు. రాజ్‌భవన్‌కు వెళ్లి నా రాజీనామా సమర్పిస్తానని ఫడ్నవీస్ తెలిపారు. సీఎంగా ప్రమాణం చేసి మూడ రోజుల తర్వాత ఫడ్నవీస్ పదవికి రాజీనామా చేశారు. బలపరీక్షకు ముందే ఫడ్నవీస్ రాజీనామా చేయడం గమనార్హం. శనివారం ఉదయం రెండోసారి సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. తమకు సంఖ్యా బలం లేదని.. ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తానని తెలిపారు. ఎన్సీపీ శాసనసభా పక్ష నేతగా అజిత్ పవార్ మాతో చేతులు కలిపారని ఫడ్నవీస్ అన్నారు. ఎన్నీపీ మొత్తం మాకు అండగా ఉంటుందని అనుకున్నామన్నారు. శివసేన తమను మోసం చేసిందని ఫడ్నవీస్ వ్యాఖ్యానించారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మూడు పార్టీలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించవని.. వాటి బరువుకు అవే కూలిపోతాయని దేవేంద్రఫడ్నవీస్ అన్నారు. మూడు పార్టీల మూడు చక్రాలు ఒకవైపు సాగవన్నారు. బాధ్యతాయుత ప్రతిపక్ష పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అజిత్ పవార్ వెళ్లిపోయాక సంఖ్యాబలం లేదని అర్థమైపోయిందన్నారు. కాగా శివసేనతో కలిసి పోటీ చేసిన బీజేపీ.. ఎన్సీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకొని ప్రతిపక్షంలో కూర్చుంది. మహారాజకీయంలో బీజేపీ ఎపిసోడ్ ముగిసింది. అజిత్ పవార్‌ను వెనక్కి రప్పించుకోవడంతో ఎన్సీపీ గేమ్ ప్లాన్ ఫలించింది.