ఈ ఫోటో భారత్ డిటెన్షన్ సెంటర్ దేనా.? డిటెన్షన్ సెంటర్లు లేవన్న మోదీ మాట అబద్దమా.?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  13 Jan 2020 11:57 AM GMT
ఈ ఫోటో భారత్ డిటెన్షన్ సెంటర్ దేనా.? డిటెన్షన్ సెంటర్లు లేవన్న మోదీ మాట అబద్దమా.?

భారత్ సిఎఎ, ఎన్ఆర్ సి లకు సంబంధించి గత నెల రోజులుగా కలకలం చెలరేగుతోంది. విపక్షాలు.. ప్రధానంగా ముస్లింలు, ముస్లింలకు సంబంధించిన రాజకీయ పార్టీలు ఆసేతు హిమాచలం రగడ సృష్టిస్తున్నాయి. దేశంలోని ముస్లిం లకు సీఏఏ తో ఎలాంటి ముప్పు లేకున్నా కొందరు ముస్లిం నేతలు మాత్రం అదేదో తమను దేశం నుంచి తరిమి కొట్టేందుకు తీసుకొస్తున్నారన్న ఆలోచనలు ప్రేరేపించే వ్యవహారం ఉద్ధృతంగా సాగుతోంది. ఇందులో భాగంగానే ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. భారతదేశంలోని ఓ డిటెన్షన్ సెంటర్లలో బందీ అయిన తల్లి ఫెన్సింగ్ లోపల నుండి తన బిడ్డకు పాలు పడుతోందన్న కామెంట్ ను ఆ ఫోటోకి జోడించారు.

డిటెన్షన్ సెంటర్లు లేవన్న మోడీ :

వాస్తవానికి భారత దేశంలో ఎలాంటి డిటెన్షన్ సెంటర్లు ఏర్పాటు చేయలేద న్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. సీఏఏతో భారతదేశంలోని ముస్లింలకు ఎలాంటి ముప్పు లేదని, ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్న మూకల మాటలు నమ్మవద్దని, దేశ ప్రయోజనాలే ముఖ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు.

సోషల్ మీడియాలో ఫోటో వైరల్:

హృదయ విదారకమైన ఆ ఫోటోను సోషల్ మీడియాలో చూసిన నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. అది నిజమే అని భ్రమ పడిపోతున్నారు. మరికొందరేమో ప్రధాని మోదీ ప్రకటనను ప్రస్తావిస్తున్నారు. చోటు ఖాన్ అనే వ్యక్తి ఫేస్బుక్లో ఈ ఫోటోను పోస్ట్ చేసి "భారతదేశంలో డిటెన్షన్ సెంటర్లు లేవు కదా" అనే రైటప్ జోడించాడు. అలాగే ట్విట్టర్ ఇతర సామాజిక మాధ్యమాల్లో కూడా ఈ ఫోటో చాలా మందికి షేర్ చేశారు. పౌరసత్వ చట్టం కారణంగా బంగ్లాదేశ్ కు చెందిన ఈ జంటకు ఇలాంటి దుస్థితి పట్టిందని, మహిళ ముస్లిం కాగా భర్త హిందూ అని అందుకే పసిపిల్ల తల్లిని డిటెన్షన్ సెంటర్లలో బంధించారని రైటప్ లు సృష్టించారు. నరేంద్ర మోడీ పాలనలో ఇంకా ఇలాంటివి చూడాల్సి వస్తుందని కూడా సోషల్ మీడియా పోస్ట్ లు వైరల్ అయ్యాయి.

మహిళలకు.. అందులోనూ పసిపిల్లల తల్లులకు అత్యంత గౌరవాన్ని ఇచ్చే భారతదేశంలో ఇలాంటి ఫోటో వైరల్ కావడం, అదీ భారత ప్రభుత్వం కారణంగానే అని కామెంట్ తో చక్కర్లు కొడుతుండడంతో వివాదాస్పదమైంది.

ఏది నిజం :

నిజానికి ఈ ఫోటో భారతదేశంలోని డిటెన్షన్ సెంటర్ కు సంబంధించినది కాదు. సరిగ్గా ఆరు సంవత్సరాల క్రితం అర్జెంటీనాలో జరిగిన అల్లర్లకు సంబంధించిన ఫోటో ఇది. అర్జెంటీనాలోని ఒక ప్రాంతంలో ఉద్రిక్తలు చోటుచేసుకోవడంతో పోలీసులు అక్కడ కంచె ఏర్పాటు చేశారు. ఆ సమయంలో కొన్ని కుటుంబాలు కంచెకు ఆవల, మరికొన్ని కంచెకు ఇవతలి వైపున ఉండిపోయాయి. అదే సమయంలో అనూహ్యంగా ఒక జంటలో భార్య కంచె లోపల మంది కాగా భర్త ఆమె నెలల పసికందు కంచె బయట ఉండిపోయారు. పాలిచ్చే సమయానికి భర్త ఆ శిశువును తీసుకొచ్చి తన భార్యతో పాలు పట్టించాడు. అప్పుడు తీసిన ఫోటో ఇది. controappuntoblog.org అనే బ్లాగ్‌లో 2013 జనవరి13 వ తేదీన ఈ ఫొటో తొలిసారిగా అప్‌లోడ్‌ అయింది. ఆ తర్వాత కూడా చాలా సందర్భాల్లో వేర్వేరు పరిణామాలను జోడిస్తూ ఈ ఫోటో వైరల్ గా మారిన పోస్టులు కూడా సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.

ప్రచారం: ఈ ఫోటో భారతదేశంలోని డిటెన్షన్ సెంటర్ కు సంబంధించినది. దేశంలో ముస్లింల పరిస్థితికి అద్దం పడుతున్న చిత్రమిది.

వాస్తవం: ఈ ఫోటో ఆరేళ్ల క్రితం అర్జెంటీనాలో తీసినది. అక్కడ జరిగిన అల్లర్ల సమయంలో ఏర్పాటుచేసిన కంచె.. తల్లి పసిబిడ్డలను విడదీసింది.

కంక్లూజన్: భారత్‌లో ఉన్న డిటెన్షన్‌ సెంటర్లకు, సీఏఏ ఆందోళనలకు ఈ ఫొటోతో ఎలాంటి సంబంధం లేదు.

- సుజాత గోపగోని.

Next Story