పద్మారావును అపోలో ఎందుకు షిఫ్ట్ చేశారు?

By సుభాష్  Published on  4 July 2020 12:55 PM IST
పద్మారావును అపోలో ఎందుకు షిఫ్ట్ చేశారు?

తెలంగాణ డిప్యూటీ స్పీకర్ తిగుళ్ల పద్మారావు గౌడ్ కు.. ఆయన కుటుంబ సభ్యుల్లో పలువురికి పాజిటివ్ గా తేలిన సంగతి తెలిసిందే. స్నేహశీలిగా ఉండే పద్మారావుకు అందరితోనూ కలివిడిగా ఉంటారు. ఉద్యమ సమయం నుంచి గులాబీ బాస్ కు సన్నిహితంగా ఉండే ఆయన..కొన్ని విషయాల్ని చాలా లైట్ గా తీసుకుంటారు. ఆయన తీరు ఎలా ఉంటుందని చెప్పే ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఒక కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన పద్మారావు.. కుర్రాడికి ఏ మాత్రం తగ్గని రీతిలో హుషారుగా రావటం.. ఆయన చేతికి మాస్కు ఇవ్వటం.. దాన్ని జేబులో పెట్టుకోవటం ఆ వీడియోలో కనిపిస్తుంది. అక్కడే ఉన్న మంత్రి కేటీఆర్ చేతిలో ఉన్న మాస్కును ఇచ్చే ప్రయత్నం చేస్తే.. సరదాగా దాన్ని లాక్కొని జేబులో పెట్టేసుకోవటం.. ఏమవుతుందన్న ధీమాను ప్రదర్శించటం కనిపిస్తుంది.

ధీమా మంచిదే కానీ.. కరోనా లాంటి ఖతర్నాక్ తో పెట్టుకుంటే తిప్పలు తప్పవన్న విషయం పద్మారావు మాష్టారికి పాజిటివ్ అని తేలటంతో మరోసారి స్పష్టమైంది. కంటికి కనిపించని ఈ మాయదారికి ఎంతటివారైనా తన దగ్గరకు వస్తే మాత్రం లొంగదీసుకోవటం అలవాటన్న మాటలో నిజం ఎంతన్నది అందరికి అర్థమైంది. పాజిటివ్ గా తేలిన తర్వాత.. రోగ లక్షణాలు పెద్దగా లేకపోవటంతో ఎప్పటిలానే ధీమాను ప్రదర్శించిన పద్మారావు హోంఐసోలేషన్ కే ప్రాధాన్యత ఇచ్చారు. ఇంట్లోనే ఉంటు చికిత్స పొందుతున్నారు.

పద్మారావు ధీమాపై ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు.. పలువురు మంత్రులు కలుగజేసుకొని.. ఆయనకు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది.

ఎందుకు రిస్క్ తీసుకుంటావన్న క్లాస్ పీకి.. తక్షణమే ఆసుపత్రిలో చేరాలన్న సూచన చేసినట్లు తెలుస్తోంది. తన సన్నిహితులతో పాటు.. అధినేత సైతం గట్టిగా చెప్పటంతో ఇష్టం లేకున్నా ఆసుపత్రిలో చేరేందుకుఓకే చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో.. ఆయన జూబ్లీహిల్స్ లోని అపోలోలో చేరారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ శుక్రవారం సాయంత్రం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. తాను పూర్తిగా కోలుకున్నట్లు పేర్కొన్నారు.

Next Story