దేశంలోని డెంగ్యూ మరణాల్లో అత్యధికం మన పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లోనే సంభవిస్తున్నాయని గత అయిదేళ్ల గణాంకాలు చెబుతున్నాయి. 2019 లో వెలువడిన నేషనల్ హెల్త్ ప్రొఫైల్ రిపోర్టు 2014 నుంచి 2018 వరకూ డెంగ్యూ మరణాలను విశ్లేషించింది. ఈ గణాంకాల ప్రకారం తమిళనాడు, మహారాష్ట్రల్లో చెరి 65 డెంగ్యూ మరణాలు సంభవించాయి.

అయితే నమోదైన కేసుల సంఖ్య విషయంలో మాత్రం మమతా దీదీ రాజ్యం పశ్చిమ బెంగాల్ అందరికన్నా ముందుంది. ఒక్క 2017 లోనే 37 వేల746 డెంగ్యూ కేసులు ఆ రాష్ట్రంలో నమోదయ్యాయి. గత అయిదేళ్లలో ఇదొక రికార్డు. బెంగాల్ లో 46 డెంగ్యూ మరణాలు నమోదయ్యాయి.

2017లో వివిధ రాష్ట్రాల్లో ఎన్ని డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ఎంత మంది చనిపోయారో చూద్దాం..

పశ్చిమ బెంగాల్‌లో 37వేల746 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. 46 మంది చనిపోయారు. తమిళనాడులో 23వేల 294 కేసులు నమోదయ్యాయి. 65 మంది చనిపోయారు. పంజాబ్‌లో 15వేల 398 కేసులు నమోదైతే..18 మంది చనిపోయారు. మహారాష్ట్రలో 7వేల 829 కేసులు నమోదైతే..65 మంది చనిపోయారు.

ఇక మన తెలంగాణాకి వస్తే 4వేల 592 కేసులు నమోదయ్యాయి. 2018 లో అందుబాటులోకి వచ్చిన తాత్కాలిక నివేదికల ప్రకారం ఇద్దరు డెంగ్యూతో చనిపోయారు. అయితే అనధికారిక రిపోర్టులు చెప్పే కథనం మాత్రం వేరొకలా ఉంది. 2019 తాలూకు గణాంకాలు పూర్తిగా లభ్యం కాకపోయినా, జూన్ నెల నుంచి ఇప్పటి వరకూ దాదాపు పదివేల కేసులు నమోదయ్యాయని మీడియా కథనాలు తెలియచేస్తున్నాయి.

వారం రోజుల క్రితం మంచిర్యాలలోని ఒక కుటుంబంలోని నలుగురు సభ్యులు పదిహేను రోజుల వ్యవధిలో డెంగ్యూతో చనిపోయారని అక్టోబర్ 31 నాటి కథనాలు తెలియచేస్తున్నాయి. అక్టోబర్ 21 న ఖమ్మంలో ఒక న్యాయమూర్తి డెంగ్యూతో చనిపోయారు. డెంగ్యూ సంక్షోభ నివారణ విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని హైకోర్టు తప్పు పట్టింది. డెంగ్యూ అధికారికి, సామాన్యుడికి మధ్య తేడా లేకుండా అందరినీ పట్టి పీడిస్తోందని హైకోర్టు ప్రధానన్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

ప్రభుత్వం ఈ మరణాలను డెంగ్యూ మరణాలుగా గుర్తించడం లేదు. దీనితో అధికారిక గణాంకాలకు, క్షేత్రస్థాయి గణాంకాలకు మధ్య చాఆ తేడా ఉంటోంది. తెలంగాణ అంతటా డెంగ్యూ మరణాల వార్తలు వస్తున్నా ప్రభుత్వం అసలు డెంగ్యూ లేనేలేదని వాదిస్తోంది.

సమన్విత వ్యాధి నిఘా ప్రాజెక్టు (ఇంటెగ్రేటెడ్ డిసీజ్ సర్వేలెన్స్ ప్రాజెక్ట్ ఐడీఎస్ పీ ) ద్వారా లభ్యమౌతున్న గణాంకాల ప్రకారం 2018 లో డెంగ్యూ మహారాష్ట్రలో 36 సార్లు, కేరళలో 13 సార్లు, పశ్చిమ బెంగాల్ లో తొమ్మిది సార్లు విరుచుకుపడింది. తెలంగాణలో మూడు సార్లు, ఆంధ్రలో ఒక సారి డెంగ్యూ దాడి జరిగింది.

దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో డెంగ్యూ ఎన్ని సార్లు వ్యాపించిందో చూద్దాం..

మహారాష్ట్రలో 36 సార్లు, కేరళలో 13 సార్లు, పశ్చిమ బెంగాల్లో 9 సార్లు డెంగ్యూ తన ప్రతాపాన్ని చూపింది.

నేషనల్ హెల్త్ ప్రొఫైల్ రిపోర్టు గణాంకాల మేరకు డెంగ్యూ దాడి గత రెండు దశాబ్దాల్లో గణనీయంగా పెరిగింది. ఈ రిపోర్టు జనాభా పరమైన, సామాజిక ఆర్ధికమైన, ఆరోగ్య స్థాయి పరమైన, వైద్య ఆరోగ్య ఖర్చుల ఆధారంగా, వైద్య ఆరోగ్య వసతులు, మానవ వనరుల వంటి వివిధ కొలమానాల ఆధారంగా దేశం తాలూకు వైద్య ఆరోగ్య పరిస్థితులను విశ్లేషించి, నివేదికలను రూపొందిస్తుంది.

నేషనల్ హెల్త్ ప్రొఫైల్ పేరిట ఈ నివేదికను 2005 నుంచి సెంట్రల్ బ్యూరో ఆఫ్ హెల్త్ ఇంటలిజెన్స్ (సీ బీ హెచ్ ఐ) క్రమం తప్పకుండా జారీ చేస్తోంది. దోమల వల్ల వ్యాపించే డెంగ్యూ చాలా ప్రమాదకరమైనది. దోమ కాటు ద్వారా వైరస్ వ్యాపించిన పధ్నాలుగు రోజుల లోపు జ్వరం, కీళ్ల నొప్పులు, తలనొప్పి, అలసట వంటి లక్షణాలు పొడసూపుతాయి. ఇవే డెంగ్యూ వ్యాధి ప్రధాన లక్షణాలు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.