భార‌త్‌కు గాలం వేసేలా బైడెన్ కీలక వ్యాఖ్యలు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  17 Aug 2020 11:18 AM IST
భార‌త్‌కు గాలం వేసేలా బైడెన్ కీలక వ్యాఖ్యలు

దాదాపు ఇరవై ఏళ్ల క్రితం భారత ప్రధాని ఎవరైనా అమెరికా పర్యటనకు వెళితే.. అక్కడి మీడియా ఇచ్చే ప్రాధాన్యత చాలా తక్కువగా ఉండటమే కాదు.. పలు సందర్భాల్లో మొదటిపేజీలో కూడా ఆ వార్తను ప్రచురించని పరిస్థితి ఉండేదిన చెబుతారు. అలాంటి స్థానే.. ఇప్పుడు పరిస్థితులు ఎంతలా మారాయన్నది అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న డెమొక్రాట్ల అభ్యర్థి జో బైడెన్ వ్యాఖ్యల్ని చూస్తే అర్థమైపోతుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రవాస భారతీయ ఓట్లు కీలకంగా మారటంతో పాటు.. సంప్రదాయంగా తమ పక్షాన ఉండే వారిని మరింతగా ఆకర్షించేలా బైడెన్ తాజా వ్యాఖ్యలు ఉండటం గమనార్హం.

అంతేకాదు.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కు మద్దతు ఇచ్చే విషయంలో తాను ఏ మాత్రం తొందరపాటుకు గురి కాకూడదన్న విషయం ప్రధాని మోడీకి అర్థమయ్యేలా బైడెన్ వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పక తప్పదు. ఆ మధ్యన అమెరికాకు వెళ్లిన సందర్భంగా మోడీ.. హోడీ అంటూ భారీ కార్యక్రమాన్ని నిర్వహించటం.. ట్రంప్ కు తాను దన్నుగా నిలుస్తానన్నట్లుగా మోడీ వ్యాఖ్యలు ఉండటం తెలిసిందే.

ఇప్పుడున్న పరిస్థితుల్లో మోడీ మాటలు భారతీయుల మీదనే కాదు.. ప్రవాస భారతీయుల మీద ప్రభావం చూపే వీలుంది. అందుకే.. మోడీ ముందర కాళ్లకు బంధాలు వేసేలా బైడెన్ తాజా వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పక తప్పదు. తాజాగా భారతీయుల్ని ఉద్దేశించి బైడెన్ చేసిన వ్యాఖ్యలు చూస్తే.. ఆయన మీద మరింత సానుకూలత పెరిగేలా ఉండటం గమనార్హం.

నవంబరు మూడున జరిగే ఎన్నికల్లో ట్రంప్ తో తలపడుతున్న బైడెన్ తాజాగా మాట్లాడుతూ.. భారత్ కోసం తానెన్ని ప్రయత్నాలు చేసింది చెప్పే ప్రయత్నం చేయటం విశేషం. పదిహేనేళ్ల క్రితం భారత్ లో చారిత్రక అణ్వాయుధ ఒప్పందం కొరకు చేసిన ప్రయత్నాన్ని చెప్పుకున్నారు. భారత్ - అమెరికాలమధ్య మైత్రీ సంబంధాలు బలపడితే.. ప్రపంచం సురక్షితంగా ఉంటుందని తాను అనాడే చెప్పినట్లుగా తన వ్యాఖ్యల్ని గుర్తు చేసే ప్రయత్నం చేశారు. తాను మాత్రమే కాదు.. తమ పార్టీ సైతం భారతీయులకు దన్నుగా ఉంటుందనన విషయాన్ని గుర్తు చేశారు.

ఒబామా అధ్యక్షుడిగా ఉన్న కాలంలో దేశ చరిత్రలోనే అత్యధికంగా భారతీయుల్ని వివిధ పదవుల్లో నియమించిన వైనాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు అమెరికా చరిత్రలోనే తొలిసారి భారత సంతతికి చెందిన వ్యక్తిని ఉపాధ్యక్షురాలిగా పోటీలో నిలిపామన్న బైడెన్.. అమెరికాలోని భారత్ కు చెందిన హిందూ.. సిక్కు.. ముస్లిం.. జైన్.. ఇతరులపై జరిగే దాడుల నుంచి రక్షణ కల్పిస్తామన్నారు.

ఇలా భారత్ కు సంబంధించి అధ్యక్ష రేసులో ఉన్న అభ్యర్థి ఇంతలా చెప్పటం చూస్తే.. అమెరికా ఎన్నికల్లో ప్రవాస భారతీయుల పాత్ర ఎంతన్నది ఇట్టే అర్థమవుతుంది. మరి.. ఇంతలా భారత జపం చేస్తున్న బైడెన్ ప్రయత్నాలు ఎంతలా ఫలిస్తాయన్నది తేలాలంటే ఎన్నికల ఫలితాలు తేలే వరకు వెయిట్ చేయాల్సిందే.

Next Story