ఢిల్లీ: భారీ ఉగ్రకుట్ర భగ్నం..!
By సుభాష్ Published on 23 Aug 2020 7:46 PM ISTదేశ రాజధాని అయిన ఢిల్లీలో భారీ ఉగ్రకుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఐసిస్ ఉగ్రవాది అబూ యూసఫ్‌ను గత రెండు రోజుల కిందట ఢిల్లీలో పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా, ఉత్తరప్రదేశ్ బలరాంపూర్‌లోని అతని ఇంట్లో భారీ ఎత్తున పదార్థాలు ఉండవచ్చని అనుమానించిన పోలీసులు.. వెంటనే ఢిల్లీ ప్రత్యేక పోలీసు బృందాలతో ఉత్తరప్రదేశ్‌లోని అతని గ్రామంలో ఉన్న ఇంటిని చుట్టుముట్టాయి. ఆయన ఇంట్లో భారీగా సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో యూసఫ్ ఇంట్లో భారీ ఎత్తున పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. మానవ బాంబులకు ఉపయోగించే బెల్టుతో పాటు ప్రెషర్ కుక్కర్, 15 కిలోల పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇవే కాకుండా తుపాకీ, ఐఎస్‌ఐఎస్ జెండా, ఉగ్రవాద సంస్థలతో సంబంధాలకు సంబంధించిన పత్రాలు కూడా లభ్యమైనట్లు పోలీసులు వెల్లడించారు.
కాగా, ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజు దేశంలో పేలుళ్లు జరిపేందుకు యూసఫ్ భారీ కుట్ర పన్నినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అయితే భారీగా పోలీసు బందోబస్తు కారణంగా ఆ ప్లాన్ అమలు చేయలేదని పోలీసుల విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. యూసఫ్ గ్రామంలోని ఓ ప్రాంతంలో పేలుడు పదార్థాలను అబూ యూసఫ్ పరీక్షించినట్లు విచారణలో అంగీకరించాడు. బాంబు నిర్వీర్యం బృందాల సాయంతో అవి పేలకుండా చేసినట్లు పోలీసులు తెలిపారు.