ఢిల్లీ అల్లర్లు: చార్జ్‌షీట్‌లో సల్మాన్‌ ఖుర్షీద్‌ పేరు

By సుభాష్  Published on  24 Sep 2020 10:41 AM GMT
ఢిల్లీ అల్లర్లు: చార్జ్‌షీట్‌లో సల్మాన్‌ ఖుర్షీద్‌ పేరు

దేశ రాజధాని ఢిల్లీలోని ఈశాన్య ప్రాంతంలో చెలరేగిన అల్లర్ల కేసులో పోలీసులు ఇప్పటికే చార్జ్‌షీట్‌ నమోదు చేసిన విషయం తెలిసిందే. పౌరసత్వ సవరణ చట్టం, ఎన్నార్సీకి వ్యతిరేకంగా సాగిన ఉద్యమదంలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి అల్లర్లకు ఉసిగొల్పారనే ఆరోపణలతోఇప్పటికే పలువురి పేర్లను అభియోగపత్రంలో చేర్చారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఎం నాయకురాలు బృందా కారత్‌, న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌, ఆర్థిక వేత్త జయతి ఘోష్‌, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ అపుర్వానంద్‌, స్వరాజ్‌ అభియాన్‌ నాయకుడు యోగేంద్ర యాదవ్‌ తదితర పేర్లు ఇందులో చేర్చారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ కేంద్ర మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ పేరును చార్జ్‌షీట్లో చేర్చిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

సుమారు 17 వేల పేజీలతో సెప్టెంబర్‌ 13న నమోదు చేసి చార్జ్‌షీట్‌లో ఉమర్‌ ఖలీద్‌, సల్మాన్‌ ఖుర్షీద్‌, నదీం ఖాన్‌ వంటి నాయులు యాంటీ సీఏఏ-ఎన్సారీ ఉద్యమాల్లో రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి ప్రజలను ప్రేరేపించారు అని ఓ సాక్షి వాంగ్మూలం ఇచ్చినట్లుగా ఢిల్లీ పోలీసులు తెలిపారు. అయితే హింస చెలరేగేలా కుట్రలు పన్నిన కోర్‌టీమ్‌లో సదరు సాక్షి కీలకంగా వ్యవహరించినట్లు పేర్కొన్నారు. సీఆర్‌పీసీలోని సెక్షన్‌ 164 ప్రకారం మెజిస్ట్రేట్‌ ఎదుట ఈ మేరకు వాగ్మూలం నమోదు చేసినట్లు తెలిపారు. వాగ్మూలం ఇచ్చిన సదరు సాక్షితోపాటు మరో నిందితుడు కూడా సల్మాన్‌ ఖుర్షీద్‌ పేరును ప్రస్తావించినట్లు పేర్కొన్నారు. అయితే ప్రసంగంలో వ్యాఖ్యానించిన విషయాల గురించి మాత్రం ఎక్కడ వెల్లడించలేదు. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి 23-26 మధ్య ఢిల్లీ ఈశాన్య ప్రాంతంలో పౌరసత్వ సవరణ చట్ట వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో 53 మంది మరణించారు.

చార్జ్‌షీట్‌లో పేరుపై స్పందించిన ఖుర్షీద్‌

చార్జ్‌షీట్‌లో పేరు నమోదు కావడంపై సల్మాన్‌ ఖుర్షీద్‌ స్పందించారు. తాను రెచ్చగొట్టే ప్రసంగాలు చేయలేదని తెలిపారు. చెత్త సమాచారం సేకరించి, అభాసుపాలు చేయాలనుకుంటే మీరే మలినం అవుతారని పేర్కొన్నారు. న్యాయమైన మద్దతు ఇచ్చేందుకే ఆ నిరసనలకు హాజరయ్యానని ఖుర్షీద్‌ తెలిపారు.

Next Story
Share it