రేపటి నుంచి రోడ్డెక్కనున్న హైదరాబాద్‌ సిటీ బస్సులు..!

By సుభాష్  Published on  24 Sep 2020 9:26 AM GMT
రేపటి నుంచి రోడ్డెక్కనున్న హైదరాబాద్‌ సిటీ బస్సులు..!

భాగ్యనగరం ప్రజలకు ఇది గుడ్‌న్యూసే. కరోనా మహమ్మారి కారణంగా గత ఆరు నెలల నుంచి డిపోలకే పరిమితమైన సిటీ బస్సులు శుక్రవారం నుంచి రోడ్డెక్కనున్నాయి. ఇందుకు సంబంధిత అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. కాగా, బుధవారం నుంచే నగర శివార్లలోని బస్సు డిపోల నుంచి ఇతర ప్రాంతాలకు బస్సులను పాక్షికంగా నడిపారు. అయితే శుక్రవారం నుంచి పూర్తిస్థాయిలో నగర వ్యాప్తంగా బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ అధికారుల ద్వారా సమాచారం. కరోనా నేపథ్యంలో ప్రయాణికులు భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు. సాధారణంగా సిటీ బస్సుల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇక నుంచి ఆ పరిస్థితి తలెత్తకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో ఉండే రాజేంద్రనగర్‌, ఇబ్రహీపట్నం, బండ్లగూడ, మహేశ్వరం, మియాపూర్‌, ఫలక్‌నుమా, హయత్‌నగర్‌ వంటి శివారు డిపోల నుంచి బస్సులను బుధవారమే ప్రారంభం అయ్యాయి. ఈ డిపోల నుంచి 12 బస్సుల చొప్పున సర్వీసులను నడుపుతున్నారు. సిటీ సబర్బన్‌ ఏరియాకు 15 కిలోమీటర్ల దూరంలో బస్సులు నడుపుతున్నారు. ఇక రేపటి నుంచి పూర్తి స్థాఇలో బస్సులు అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్టీసీ అధికారులు సిద్దమవుతున్నారు.

గ్రేటర్‌లో 3798 బస్సులు

కాగా, గ్రేటర్‌ హైదరాబాద్‌లో 3798 ఆర్టీసీ బస్సులున్నాయి. గత ఏడాది సమ్మె కారణంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా కొన్ని సర్వీసులను పక్కనపెట్టేశారు. మిగిలిన 3298 బస్సులతో గ్రేటర్‌ బస్సులు 9 లక్షలకుపైగా కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ 34 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి.

గ్రేటర్‌ ఆర్టీసీకి రోజువారి ఆదాయం రూ.3.50 కోట్లు

కాగా, ఈ బస్సుల ద్వారా గ్రేటర్‌ ఆర్టీసీకి రోజువారి ఆదాయం రూ.3.50 కోట్లు సమకూరుతుంది. అయితే కరోనా మహమ్మారి కారణంగా లాక్‌డౌన్‌తో ఆర్టీసీ పూర్తిగా ఆదాయం కోల్పోవాల్సి వచ్చింది. ప్రస్తుతం అన్‌లాక్‌ 4లో భాగంగా మెట్రో రైళ్లు సైతం పట్టాలెక్కాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో బస్సులను తిప్పేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

Next Story