ముఖ్యాంశాలు

  • అత్యంత ప్ర‌మాద‌క‌ర స్థాయికి డిల్లీ కాలుష్యం
  • నిన్న‌టి వ‌ర్షంతో ఇంకా పెరిగిన కాలుష్యం
  • ఢిల్లీని వీడుతున్న ప్ర‌జానీకం

దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం క‌మ్మేసింది. అత్యంత ప్ర‌మాద‌క‌ర స్థాయిలో ప్రజలు బయటికిరాలేని పరిస్థితి నెలకొంది. గురువారం రాత్రి నుంచి మొద‌లైన‌ కాలుష్యం ఆదివారం నాటికి వెయ్యి పాయింట్లు దాటింది. దీంతో ఇప్పటికే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పాఠశాలలకు సెలవులను కూడా ప్రకటించారు.

ఢిల్లీ వాతావరణం మొత్తం విషపూరితంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్(ఎన్‌సీఆర్)లో నివాసం ఉంటున్న ప్రజలు తమ నివాసాలను విడిచిపెట్టి ఇతర నగరాలకు వెళ్లాలనే యోచనలో ఉన్నారు. దాదాపు 40శాతం మంది ప్రజలు తమ నివాసాలను విడిచి వెళ్లాలనుకుంటున్నట్లు తాజాగా ఓ సర్వే తేల్చింది.

కాలుష్యం కారణంగా ఇప్పటికే 13 శాతం మంది ఆస్పత్రుల పాలవ్వగా, 29శాతం మంది ప్రజలు వైద్యులను సంప్రదించారు. 44శాతం మంది అనారోగ్యానికి గురయ్యామని వెల్లడించారు. కేవలం 14 శాతం మంది మాత్రమే కాలుష్యం కారణంగా ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కోలేదని చెప్పడం గమనార్హం. ఆదివారం ఉదయం వర్షం పడటంతో ఢిల్లీలో వాయు కాలుష్యం మరింత పెరిగింది. సెంట్రల్ పొల్యూషన్ సెంట్రల్ బోర్డ్ డేటా, ది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లెక్క‌ల‌ ప్రకారం ఢిల్లీ కాలుష్యం ఉదయం 11గంటలకు 486 పాయింట్లు ఉంది. పూస, ఐటీఓ, ముండ్కా, పంజాబీ బాగ్ ప్రాంతాల్లో కాలుష్యం అధికంగా ఉన్న‌ట్లు స‌మాచారం.

సామ్రాట్ మేడి

మేడి. సామ్రాట్ .. నేను న్యూస్ మీట‌ర్ లో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తున్నాను. గ‌తంలో ఆంధ్ర‌ప్ర‌భ‌, భార‌త్ టుడే, న్యూస్ హ‌బ్, ఏపీ హెరాల్డ్ ల‌లో 3 సంవ‌త్స‌రాల పాటు ప‌నిచేశాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.