దేశ రాజధాని గ్యాస్ ఛాంబర్‌లా మారింది. వాయు కాలుష్యం ఢిల్లీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఊపిరి పీల్చుకోవడానికి ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. పొల్యూషన్ లెవల్స్‌ బాగా పెరిగిపోవడం తో హెల్త్ ఎమర్జెన్సీ విధించారు. గాలిలో విషపూరిత కణాలు, రసాయనాలు కలవడం వల్ల ఆరోగ్య అత్యవసర స్థితి విధించామని అధికార వర్గాలు తెలిపాయి. గాలి నాణ్యతపై అధ్యయనం చేసే సఫర్ సంస్థ కూడా ప్రస్తుత పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసింది. పీఎం 2.5గా నమోదైందని సఫర్ సంస్థ తెలిపింది. ప్రస్తుతం ఢిల్లీలో గాలి నాణ్యత హానీకరస్థాయికి చేరిందని పేర్కొంది. గాలి నాణ్యతా సూచి 508గా నమోదైంది.

గాలి నాణ్యత అధమస్థాయికి పడిపోవడం ఢిల్లీ ప్రజలకు వణుకు పుటిస్తోంది. ఊపిరి తీసుకోవడానికి కూడా ప్రజలు భయపడుతున్నారు. శ్వాసకోశ సమస్యలు, కళ్ల నుంచి నీరు కారడం తదితర సమస్య లతో ప్రజలు ఆస్పత్రుల్లో చేరుతున్నారు. రోగుల సంఖ్య పెరిగిపోవడంతో హాస్పిటళ్లు కిటకిటలాడుతున్నాయి. అత్యవరస స్థితి నుంచి బయటపడే వరకు ప్రజలెవరూ బయటకురావద్దని అధికారులు హెచ్చరించారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నా, ఛాతీలో నొప్పిగా ఉన్నా, అలసటగా అనిపిస్తున్నా వెంటనే వైద్యుల్ని సంప్రదించాలని కోరారు.
హెల్త్ ఎమర్జెన్సీ నేపథ్యంలో కేజ్రీవాల్ సర్కారు ఉపశమన చర్యలు చేపట్టింది. విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ప్రజలకు మాస్క్‌లు పంపిణీ చేస్తున్నారు. మాస్క్‌లు లేకుండా ఇంటి నుంచి బయటకు రావొద్దని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సూచించారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.