ఆలస్యమైనా న్యాయమే గెలిచింది: నిర్భయ తల్లి
By సుభాష్ Published on 20 March 2020 6:44 AM ISTఏడేళ్ల కిందట ఢిల్లీలో నిర్భయపై దారుణంగా అత్యాచారానికి పాల్పడిన దోషులకు ఎట్టకేలకు తీహార్ 3 నెంబర్ జైల్లో ఉరిశిక్ష అమలు అయింది. ఉదయం 5.30 గంటలకు నలుగురు దోషులైన పవన్ గుప్త (25), అక్షయ్ కుమార్ (30), వినయ్ శర్మ (26), ముఖేష్‌సింగ్ (32)లను ఒకేసారి ఉరి తీశారు. దోషులను ఉరి తీసే సమయంలో జైలు వద్ద పెద్ద ఎత్తున జనాలు గుమిగూడారు. దీంతో జైలు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దోషులకు ఉరి తీసిన అనంతరం నిర్భయ తల్లి ఆశాదేవి మీడియా ముందు మాట్లాడారు. ఏడేళ్ల అయినా చివరికి న్యాయమే గెలిచిందని సంతోషం వ్యక్తం చేశారు. ఆలస్యమైనా నా కుమార్తెకు న్యాయం జరిగిందని, దోషులకు ఉరితో నిర్భయ ఆత్మ శాంతిస్తుందని అన్నారు.
ఇక ఇంతటితో నా పోరాటం ఆగదని, ఇలాంటి కేసుల్లో సత్వర న్యాయం జరిగేందుకు పోరాటం చేస్తానని అన్నారు. వ్యవస్థ లోపాలతో దోషులు ఆడుకున్నారని ఆమె వ్యాఖ్యనించారు. కుమార్తెకు జరిగిన అన్యాయంపై ఓ తల్లి చేసిన పోరాటం ఎట్టకేలకు ఫలించిందని ఆమె అన్నారు.
కాగా, వాస్తవానికి జనవరి 22న దోషులను ఉరి తీయాల్సి ఉండగా, ఒక దోషి క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉండటంతో ఉరిని వాయిదా వేశారు. ఫిబ్రవరి 1న వీరికి ఉరి శిక్ష విధించగా, దోషుల పిటిషన్ల కారణంగా శిక్ష అమలు వాయిదా పడింది. ఇక మూడోసారి మార్చి 3న ఢిల్లీ పటియాల కోర్టు ఉరిశిక్ష విధించగా, అది కూడా విఫలమైంది. దోషి పిటిషన్ పెండింగ్‌లో ఉందనే కారణంగా వాయిదా పడింది. మార్చి 5వ తేదీని పటియాల కోర్టు డెత్ వారెంట్ జారీ చేయగా, మార్చి 20న ఉదయం 5.30 గంటలకు తీహార్ జైల్లో నలుగురు దోషులను ఒకసారి ఉరి తీశారు.