నిర్భయ నిందితులకు ఉరి శిక్ష అమలుపై తీర్పు ఇవ్వనున్న ఢిల్లీ హై కోర్టు

By రాణి  Published on  5 Feb 2020 5:53 AM GMT
నిర్భయ నిందితులకు ఉరి శిక్ష అమలుపై తీర్పు ఇవ్వనున్న ఢిల్లీ హై కోర్టు

నిర్భయ పై అత్యాచారం కేసులో నిందితులుగా ఉన్న నలుగురు దోషులను ఫిబ్రవరి 1వ తేదీనే తీహార్ జైలులో ఉరి తీయాల్సి ఉండగా..ఆ ముందు రోజు అంటే జనవరి 31వ తేదీ సాయంత్రం ఢిల్లీ పటియాలా కోర్టు ఉరిశిక్ష అమలుపై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నిందితుల ఉరి ఆగిపోయింది. కోర్టు ఉరిశిక్ష అమలుపై స్టే ఇవ్వడంతో..దానిని సవాల్ చేస్తూ కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం హై కోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ ను పరిశీలించి, నేడు తీర్పు ఇవ్వనుంది అక్కడి హై కోర్టు. కాగా..దోషులకు సంబంధించిన క్షమాభిక్ష, క్యురేటివ్ పిటిషన్లు పెండింగ్ లో ఉండటం వల్ల ఉరిశిక్ష అమలుపై స్టే విధించింది పటియాలా కోర్టు.

నలుగురు నిందితులకు ఒకేసారి ఉరివేయాలన్న రూల్ ను అడ్డం పెట్టుకుని ముఖేష్ సింగ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్ సింగ్ లు ఒకరి తర్వాత ఒకరు క్షమాభిక్ష, క్యురేటివ్ పిటిషన్లను దాఖలు చేస్తున్నారు. ఈ కారణం చేతనే ఫిబ్రవరి 1వ తేదీ అమలు కావాల్సిన శిక్ష వాయిదా పడింది. నిందితుల ఉరిశిక్ష అమలుపై దేశ వ్యాప్తంగా విమర్శలు వస్తుండటంతో కేంద్రం ముందడుగు వేసింది. కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఇవాళ కోర్టులో హాజరవుతారు. అత్యంత దారుణమైన నేరం చేసి కూడా దోషులకు శిక్ష పడకపోవడంపై యావత్ దేశం అసంతృప్తితో ఉందని ఆయన అన్నారు.

Next Story