ఢిల్లీ ఎన్నికలు: ఇవిగో ఎగ్జిట్‌ పోల్స్‌..

By సుభాష్
Published on : 8 Feb 2020 7:32 PM IST

ఢిల్లీ ఎన్నికలు: ఇవిగో ఎగ్జిట్‌ పోల్స్‌..

ఢిల్లీలో 2020 అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్‌ ముగిసింది. శనివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ కొనసాగింది. పోలింగ్‌లో ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయంత్రం 6 గంటల వరకు 58 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. మొత్తం 70 స్థానాలకు 672 మంది అభ్యర్థులు బరిలో దిగారు. పోలింగ్‌ పూర్తయిన అనంతరం విడుదలైన ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు ఆమ్‌ఆద్మీ పార్టీకే అనుకూలంగా వచ్చాయి. ఢిల్లీలో అరవింద్‌ కేజ్రీవాల్‌ మరోసారి రాష్ట్ర పగ్గాలు చేపట్టబోతున్నట్లు ఎగ్జిల్‌ పోల్స్‌ ఫలితాలు చెబుతున్నాయి. పోలింగ్ ముగిసిన తర్వాత జాతీయ ఛానళ్లు ఎగ్జిట్‌ పోల్స్‌ ను ప్రసారం చేశాయి. ఈ ఎగ్జిల్‌పోల్స్‌ ఫలితాలు ఆప్‌కే మొగ్గు చూపాయి.

ఎవరికి ఎన్ని..

ఢిల్లీలో మొత్తం 70 సీట్లలో ఆమ్‌ఆద్మీకి 54 నుంచి 59 సీట్లు రావచ్చని ఫలితాలు చెబుతున్నాయి. అలాగే బీజేపీకి 9 నుంచి 15 సీట్లు, కాంగ్రెస్‌ ౦ నుంచి 2 సీట్లు వరకు గెలుచుకుంటాయని పీపుల్స్‌ పల్స్‌ ప్రెడిక్షన్‌ సర్వే సంస్థ అంచనా వేసింది. చాలా ప్రాంతాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు డిపాజిట్‌ కోల్పోయే పరిస్థితి ఉందని తెలిపింది. కాగా, సంక్షేమ పథకాలు ఆమ్‌ఆద్మీకి మరో అధికారాన్ని కట్టబెడుతున్నట్లు పేర్కొంది.

అలాగే ఈ ఎన్నికల్లో ఆప్‌ మరోసారి విజయఢంకా మొగిస్తుందని టైమ్స్‌ నౌ వెల్లడించింది. ఆమ్‌ ఆద్మీకి 44, బీజేపీ 26 స్థానాలు దక్కించుకోనున్నట్లు ప్రకటించింది. ఇక న్యూస్‌ ఎక్స్‌ నేతా ప్రకారం.. ఆప్‌ 53 నుంచి 57 సీట్లు, బీజేపీ 11 నుంచి 17 సీట్లు, ఇతరులు 0 నుంచి2 సీట్ల వరకు సాధించే అవకాశం ఉందన్నారు. అలాగే రిపబ్లిక్‌ టీవీ ఎగ్జిల్‌ పోల్స్‌ ప్రకారం.. ఆప్‌ 48 నుంచి 61 సీట్లు, బీజేపీ 9 నుంచి 21 సీట్లు దక్కించుకునే అవకాశం ఉందని తెలిపింది. ఇక ఇతర ఛానళ్లు నిర్వహించిన ఎగ్జిల్‌పోల్స్‌ ఫలితాలు కూడా మరోసారి ఆప్‌కే మొగ్గు చూపాయి.

Next Story