మహిళ, ఇద్దరు కూతుళ్ల మీద నుండి వెళ్లిన ట్రైన్.. ఏడ్చుకుంటూ కనిపించిన సంవత్సరం పిల్లాడు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 July 2020 12:15 PM GMT
మహిళ, ఇద్దరు కూతుళ్ల మీద నుండి వెళ్లిన ట్రైన్.. ఏడ్చుకుంటూ కనిపించిన సంవత్సరం పిల్లాడు

న్యూఢిల్లీ: ఓ మహిళ ఆమె ఇద్దరు కుమార్తెలు గురువారం నాడు ట్రైన్ కింద పడి మరణించినట్లు రైల్వే పోలీస్ ఫోర్స్ అధికారులు ధృవీకరించారు. ఒక సంవత్సరం వయసు ఉన్న బాలుడు మాత్రం ఆ మృతదేహాల మధ్య ఏడ్చుకుంటూ కనిపించాడు. ఆ పిల్లాడి తల్లి, ఇద్దరు అక్కలు మరణించగా ఆ పిల్లాడు ప్రాణాలతో బయటపడ్డాడు.

ఉదయం 3:40 సమయంలో రైల్వే పోలీసులు పట్టాల మధ్య శవాలు ఉన్నాయని అన్నారు. చూస్తే ఒక మహిళ, ఇద్దరు అమ్మాయిల శవాలు కనిపించాయి. ఆ శవాల మధ్యలో పిల్లాడు మాత్రం ఏడుస్తూ కనిపించాడు. వాయువ్య ఢిల్లీ లోని మండవాలి ప్రాంతంలో ఈ దారుణం చోటుచేసుకుంది.

అధికారులు ఆ ప్రాంతానికి చేరుకున్న సమయంలో, 30 సంవత్సరాల మహిళ ఇద్దరు బాలికలపై నుండి ట్రైన్ వెళ్ళింది. వారి మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఇంతలో ఓ పిల్లాడి ఏడుపు వినిపించింది. చూస్తే సంవత్సరం వయసు ఉన్న పిల్లాడు ప్రాణాలతో కనిపించాడని డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్(రైల్వేస్) హరేంద్ర సింగ్ తెలిపారు.

ఆ పిల్లాడికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పిల్లాడి గురించి ఓ వ్యక్తి వాకబు చేస్తుండడం అందులో గమనించవచ్చు. ఆ పిల్లాడిని ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్య పరిస్థితి బాగుందని అధికారులు తెలిపారు. ఆ మృతదేహాల దగ్గర లభించిన మొబైల్ ఫోన్ ఆధారంగా చనిపోయిన మహిళను 30 సంవత్సరాల కిరణ్ గా గుర్తించారు. భర్తతో గొడవ కారణంగా ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అయిదు, ఆరేళ్ళ వయసున్న కుమార్తెలను కూడా తనతో పాటు పట్టాల మీద పడుకోబెట్టినట్లు అధికారులు గుర్తించారు. ఆమె భర్త ఈ-రిక్షా ఓనర్. గత సాయంత్రం అతడు ఇంటికి రాగా అప్పటికే భార్యా పిల్లలు కనిపించలేదు. కుటుంబ కలహాల కారణంగా ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

Next Story