ఢిల్లీ జనాభాలో 23శాతం మందికి కరోనా వైరస్

By సుభాష్  Published on  22 July 2020 9:57 AM IST
ఢిల్లీ జనాభాలో 23శాతం మందికి కరోనా వైరస్

దేశంలోకరోనా వైరస్‌ తీవ్రంగా ఉంది. ఇక దేశ రాజధాని అయిన ఢిల్లీలో ఉన్న జనాభాలో 23 శాతం మందికి కరోనా వైరస్‌ యాంటీబాడీలు ఉన్నట్లు ఇటీవల నిర్వహించిన సీరో సర్వేలో తేలింది. అయితే దేశంలో కరోనా వైరస్‌ ప్రారంభమై దాదాపు ఆరు నెలలు గడుస్తోంది. జనసాంద్రత చాలా ఎక్కువగా ఉండే ఢిల్లీలో ఇన్ని నెలల్లో 23.48 శాతం మంది కరోనాకు గురయ్యారు .. అని కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం ప్రకటించింది. నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌, ఢిల్లీ ప్రభుత్వం కలిసి ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో జూన్‌ 27 నుంచి జూలై 10 మధ్య దశల వారీగా 21,387 మందికి పరీక్షలు చేశారు. అందులో వచ్చిన ఫలితాల ఆధారంగా ఢిల్లీలో 23శాతం మంది ఇటీవల కాలంలో కరోనా బారిన పడినట్లు తేల్చారు.

ఆరునెలల వ్యవధిలో23 శాతం మందికి మాత్రమే వైరస్‌ సోకిందని, వైరస్‌ వ్యాప్తి నిరోధించడానికి ప్రభుత్వం తీసుకున్న పటిష్టమైన చర్యలే కారణమని కేంద్రం ఘనంగా చెప్పుకొచ్చింది. కానీ ఢిల్లీ జనాభాలో 1.9 కోట్లలో 23శాతం అంటే దాదాపు 44.61 లక్షల మందికి కరోనా సోకినట్లే. దేశంలో సామాజిక వ్యాప్తి ఇప్పటికే ప్రారంభమైందని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ రెండు రోజుల కిందట చేసిన ప్రకటనకు ఢిలీ సర్వే బలం చేకూర్చేలా ఉంది. ఇది సామాజిక వ్యాప్తికి సంకేతమని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

జూన్‌ 23న ఢిల్లీలో అత్యధికంగా ఒక్క రోజే 3,947 కేసులు నమోదు కాగా, ఆ తర్వాత నుంచి కేసులు సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది. దాదాపు నెలన్నర రోజుల తర్వాత సోమవారం ఢిల్లీలో 954 కేసులు నమోదు అయ్యాయి. అలాగే యాక్టివ్‌ కేసుల సంఖ్య కూడా గత వారం రోజులుగా తగ్గుతూ వచ్చి రికవరీ రేటు 85శాతంకు చేరుకుంది. ఢిల్లీ జనాభాలో 23శాతం మందికిపైగా ఇప్పటికే కరోనా సోకిందని సీరో సర్వేలో తేలడాన్ని చూస్తే.. ఆ రాష్ట్రం హెర్డ్‌ ఇమ్యూనిటీ దిశగా సాగుతున్నట్లు కనిపిస్తోందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తగిన జాగ్రత్తలతో పాఠశాలలు, కళాశాలలను తెరవడం ద్వారా హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధింవచ్చని ఎయిమ్స్‌ వైద్యులు చేసిన సూచనలు కూడా ఈ కోణంలో చూస్తే కొంత మేరకు సరైనదేనని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

దేశంలోకరోనా వ్యాప్తి ఎంత మేరకు ఉందో పరిశీలించేందుకు భారత వైద్య పరిశోధన మండలి మే నెల మధ్య నుంచి చివరి వరకు ఒక సర్వే నిర్వహించింది. దేశ వ్యాప్తంగా 21 రాష్ట్రాల్లోని 83 జిల్లాల్లో సర్వే నిర్వహించగా, 0.73శాతం మందిలోనే యాంటీబాడీలు కనిపించాయి. అంటే వ్యాప్తి ఒకశాతం లోపే. కానీ ఇప్పుడు ఢిల్లీలోఏకంగా 23శాతం మందిలో యాంటీబాడీలు కనిపించాయంటే వైరస్‌ ఎంత ఉధృతంగా వ్యాపిస్తోందో ఇట్టే అర్థమైపోతోంది

నిర్లక్ష్యం వద్దు..

ఢిల్లీ జనాభాలో కేవలం 23.48శాతం మందికే వైరస్‌ సోకిందని చెబుతున్న కేంద్ర ఆరోగ్యశాఖ.. ఈ సమయంలో నిర్లక్ష్యం చేయకూడదని అభిప్రాయపడింది. మిగతా జనాభాకు వైరస్‌ సోకే ప్రమాదం ఉన్నందున మరింత జాగ్రత్త ఉండాలని సూచిస్తోంది. కరోనా కట్టడికి మరింత చర్యలను కొనసాగించాలని అధికారులకు సూచించింది

Next Story