ఢిల్లీలో విషాదం.. ఐదుగురు విద్యార్థులు మృతి
By అంజి
ఢిల్లీ: గోకాల్‌పూర్ భజన్‌పురాలో ప్రాంతంలో శనివారం కోచింగ్ సెంటర్ బిల్డింగ్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు మృతి చెందారు. మరో 13 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రిలో చేర్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు, రెస్కూ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కొచింగ్ సెంటర్ బిల్డింగ్ కూలినప్పుడు అక్కడ చాలా మంది విద్యార్థులు ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. భవనం లోపల మరో 30 మంది విద్యార్థులు చిక్కుకున్నారని సమాచారం. ఈ ప్రమాద ఘటనతో అక్కడ గందరగోళ పరిస్థితి ఏర్పడింది. కూలిన భవనంలో కోచింగ్ సెంటర్ నడుస్తున్నట్లు ఢిల్లీ ఫైర్ సర్వీస్ అధికారి ఒకరు తెలిపారు. భవన శిథిలాల కింద ఎంత మంది చిక్కుకున్నారో తెలియాల్సి ఉంది. భవనం కూలిందని సాయంత్రం 4.30 గంటలకు ఫైర్ సర్వీస్ సిబ్బందికి సమాచారం అందిందని ఒక అధికారి తెలిపారు.
ఈ ప్రమాద ఘటనపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. భజన్‌పురా ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు మరణించండం చాలా బాధకరమన్నారు. క్షతగాత్రులు కోలుకోవాలని ఆయన భగవంతుడిని ప్రార్థించారు. ఇదిలా ఉండగా.. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ సంఘటన స్థలాన్ని పరిశీలించారు.