ఎన్‌సీబీ ముందు హాజరైన దీపికా
By తోట వంశీ కుమార్ Published on 26 Sep 2020 8:06 AM GMTడ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటి దీపికా పదుకొణె ఎన్‌సీబీ(నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో) ఎదుట విచారణకు హాజరయ్యారు. ముంబైలోని పోర్ట్ ట్రస్ట్ అతిథి గృహంలో అధికారులు ఆమెను ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో అదుపులో ఉన్న టాలెంట్ మేజేజర్ జయా సాహాను విచారించగా టాప్ స్టార్ దీపికా పదుకోన్ పేరు తెరపైకి వచ్చింది. దాంతో డ్రగ్స్ కేసులో దీపికాకు ఎన్‌సీబీ అధికారులు బుధవారం సమన్లు జారీ చేశారు. మరోవైపు.. దీపికకు మానసికంగా కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయని, ఎన్‌సీబీ విచారణ సమయంలో తాను కూడా దీపికతోనే ఉంటానని రణ్‌వీర్ సింగ్ అధికారులను కోరినట్లు వార్తలు వచ్చాయి. ఈ ప్రచారాన్ని ఎన్‌సీబీ అధికారి ఒకరు కొట్టిపారేశారు. దీపిక నుంచి కానీ, ఆమె కుటుంబం నుంచి కానీ అలాంటి అభ్యర్థన తమకు రాలేదని చెప్పారు. తాను విచారణకు హాజరవుతానంటూ దీపిక తమకు ఓ ఈ-మెయిల్ మాత్రమే పంపించిందని తెలిపారు.
డ్రగ్స్ కేసులో దీపికతో పాటు బాలీవుడ్ యంగ్ హీరోయిన్లు శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్, రకుల్ ప్రీత్‌సింగ్‌లకు కూడా సమన్లు పంపారు. వీరిలో రకుల్ శుక్రవారమే అధికారుల ముందు హాజరైంది. రకుల్ ప్రీత్ సింగ్ ను దాదాపు నాలుగు గంటల పాటు విచారించారు. ఈ విచారణలో రకుల్ నలుగురు బాలీవుడ్ స్టార్ల పేర్లను వెల్లడించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీపికతో పాటు నేడు శ్రద్దా కపూర్, సారా అలీఖాన్‌లు కూడా విచారణకు హాజరుకానున్నారు. ముందస్తు జాగ్రత్తగా ఎన్‌సీబీ కార్యాలయం వద్ద ముంబై పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
తాజాగా కరణ్ జోహార్ సహాయకులు క్షితిజ్ ప్రసాద్, అనుభవ్ చోప్రాల వద్ద భారీ మొత్తంలో ఎన్‌సీబీ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుంది. అయితే ఈ వ్యవహారానికి తనకు ఎటువంటి సంబంధంలేదని శనివారం కరణ్ స్పష్టం చేశారు. ఆ మేరకు కొన్ని మీడియా ఛానళ్లు ప్రసారం చేస్తున్న వార్తలను ఖండించారు. అనుభవ్ చోప్రా 2011-2013 మధ్య తమ సంస్థతో రెండు ప్రాజెక్టులలో పనిచేసినప్పటికీ ధర్మ ప్రొడక్షన్‌లో ఉద్యోగి మాత్రం కాదని కరణ్ తెలిపారు.