ప్రభాస్ సినిమాలో దీపిక.. ఇదిగో రుజువు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  30 May 2020 5:02 PM IST
ప్రభాస్ సినిమాలో దీపిక.. ఇదిగో రుజువు

బాహుబ‌లి మాత్ర‌మే కాదు.. గ‌త కొన్నేళ్ల‌లో తెలుగు సినిమా స‌త్తాను జాతీయ, అంత‌ర్జాతీయ స్థాయిలో చాటిన సినిమాలు చాలానే ఉన్నాయి. కంటెంట్ ప‌రంగా చూస్తే బాహుబ‌లిని మించిన సినిమాలు మ‌న ద‌గ్గ‌ర వ‌చ్చాయి. అందులో మ‌హాన‌టి కూడా ఒక‌టి. ఈ చిత్రం వంద‌ల కోట్ల వ‌సూళ్లు సాధించ‌క‌పోయి ఉండొచ్చు. కానీ తెలుగు సినిమా చ‌రిత్ర‌లో ప్ర‌త్యేకంగా నిలిచిపోయే గొప్ప సినిమాల్లో ఇదొక‌టి. ఈ చిత్రానికి జాతీయ అవార్డుల్లోనూ త‌గు గౌర‌వం ల‌భించింది. సావిత్రి పాత్ర చేసిన కీర్తి సురేష్‌తో పాటు ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ కూడా గొప్ప పేరు సంపాదించారు. వివిధ సినీ ప‌రిశ్ర‌మ‌ల ప్ర‌ముఖుల్ని ఈ చిత్రం ఆక‌ట్టుకుంది. తాజాగా మ‌హాన‌టి బాలీవుడ్ అగ్ర క‌థానాయిక దీపికా ప‌దుకొనేను మెప్పించింది.

మ‌హాన‌టి సినిమా చూసి ముగ్ధురాలైన దీపిక‌.. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో మ‌హాన‌టి పోస్ట‌ర్ షేర్ చేసి ఈ సినిమా చూడాలంటూ త‌న ఫాలోవ‌ర్ల‌ను కోరింది. దీనిపై మ‌హాన‌టి ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ స్పందించాడు. దీపిక మెసేజ్ ప‌ట్ల త‌న ఆనందాన్ని పంచుకున్నాడు. లాక్ డౌన్ టైంలో ఖాళీగా ఉంటున్న సెల‌బ్రెటీలు.. వివిధ భాష‌ల్లో ఉత్త‌మ చిత్రాల్ని ఎంచుకుని చూస్తున్నారు. ఐతే దీపిక ఏరి కోరి తెలుగు సినిమాను చూడటం వెనుక వేరే కారణం ఉందన్నది ఇండస్ట్రీ వర్గాల మాట.

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటించబోయే కొత్త సినిమాలో దీపికను కథానాయికగా అనుకుంటున్నట్లు వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. మరి తాను నటించబోయే సినిమా దర్శకుడి ప్రతిభ ఏంటో చూద్దామని ‘మ‌హాన‌టి’ఫై దీపిక ఓ లుక్కేసి ఉండొచ్చు. అది బాగా నచ్చి తన ఫాలోవర్లందరినీ ఆ సినిమా చూడమని చెప్పి ఉండొచ్చు. గతంలో దీపిక.. జ‌యంత్ సి.ప‌రాన్జీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ తెలుగు సినిమాలో స్పెష‌ల్ సాంగ్ చేసింది కానీ.. ఆ చిత్రం విడుద‌ల‌కు నోచుకోలేదు. ఐతే ఇప్పుడు ఓ మెగా మూవీతోనే తెలుగులో అడుగు పెట్టబోతోందన్నమాట.

Next Story