చైనాలో నెమ్మదించిన కరోనా

By సుభాష్  Published on  13 March 2020 3:37 AM GMT
చైనాలో నెమ్మదించిన కరోనా

కరోనా వైరస్ వ్యాప్తి తమ దేశంలో నెమ్మదిస్తోందని చైనా ఆరోగ్య కమిషన్ ప్రకటించింది. చైనా నేషనల్ హెల్త్ కమిషన్ అధికార ప్రతినిథి మి ఫెంగ్ గురువారం విలేకర్ల సమావేశంలో ప్రకటించారు. కరోనా వైరస్ ప్రారంభ స్థానమైన హుబేయ్ ప్రావిన్స్‌లో తొలిసారి 10 కంటే తక్కువ కేసులు నమోదయ్యాయయని ఆయన అన్నారు. ఈ ప్రావిన్స్‌లో కొత్తగా కేవలం 8 కేసులు మాత్రమే నమోదైన నేపథ్యంలో ఆయన ఈ మేరకు స్పందించారు.

మరోవైపు కరోనా వైరస్‌పై పోరులో ఇటలీకి సాయం అందించేందుకు చైనా ముందుకొచ్చింది. ఇటలీ రెడ్‌ క్రాస్‌ విజ్ఞప్తి మేరకు చైనాకు చెందిన వైద్య నిపుణుల బృందం బుధవారం ఇటలీకి బయల్దేరి వెళ్లింది. చైనా రెడ్‌క్రాస్‌ సొసైటీ ఉపాధ్యక్షుడి నేతృత్వంలోని ఈ ఏడుగురుసభ్యుల బృందం తమతోపాటు ఇటలీకి సహకరించేందుకు తమ వెంట ఔషధాలు, వైద్య పరికరాలను తీసుకెళ్లింది. ఇటలీలో ఇప్పటికే కరోనా కేసులు పదివేలకు పైగా నమోదు కాగా, ఆరు వందల మంది ప్రాణాలు కోల్పోయారు. దీనితో దేశం మొత్తాన్ని క్వారంటైన్‌ శిబిరంగా మార్చేశారు.

కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయటంలో విజయం సాధించిన చైనా అనుభవాలను తెలుసుకున్న ఇటలీ ఈ విషయంలో చైనా సాయాన్ని కోరింది. ఇరాన్‌ విజ్ఞప్తి మేరకు ఔషధాలు, వైద్య పరికరాలను ఆ దేశానికి పంపుతున్నట్లు చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ ఇ వివరించారు. ఇందులో అత్యవసర ఔషధాలతో పాటు భారీ సంఖ్యలో ఫేస్‌ మాస్క్‌లు, ఇతర వైద్య పరికరాలు వున్నాయని ఆయన చెప్పారు. మొత్తం 4,556 బాక్స్‌లతో ఒక ఛార్టర్డ్‌ కార్గో విమానం బుధవారం ఇటలీకి వెళ్లిందని ఆయన వెల్లడించారు. కరోనా వైరస్‌పై ఇరుదేశాలూ కొనసాగిస్తున్న ఉమ్మడి పోరు ఇరుదేశాలు, ప్రజల మధ్య స్నేహ, సంబంధాలను మరింత బలోపేతం చేయగలదని భావిస్తున్నట్లు వాంగ్‌ ఇ చెప్పారు.

Next Story