'దక్కన్ క్రానికల్' బెంగుళూర్ ఎడిషన్ మూసివేత..?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 27 Dec 2019 10:34 AM ISTనష్టాలో ఊబిలో కూరుకుపోయిన దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ (డీసీహెచ్ఎల్) క్రమంగా ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. కొద్ది రోజుల క్రితమే కేరళ కేంద్రంగా నడుపుతున్న కొచ్చి ఎడిషన్‌ను బంద్ చేసిన సంస్థ.. తాజాగా బెంగుళూరు ఎడిషన్‌ను కూడా మూసివేస్తునట్లు తెలుస్తుంది. ఈ మేరకు బెంగుళూర్ ఎడిషన్ వెలువడేది ఈ ఒక్క రేజే అని.. రేపటి నుండి బంద్ చేస్తున్నట్టు సమాచారం.
డీసీహెచ్ఎల్ సంస్థ నష్టాల ఊబిలో ఉన్న కారణంగా.. సంస్థ యొక్క గ్రూపు పత్రికలైన దక్కన్ క్రానికల్, ఏషియన్ ఏజ్, ఫైనాన్షియల్ క్రానికల్, ఆంధ్రభూమి పత్రికలకు సంబంధించి ఎక్కడైతే సొంత ప్రెస్ లేదో అక్కడి ఎడిషన్‌లను బంద్ చేయడానికి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. దీనిలో భాగంగానే కొచ్చి ఎడిషన్, బెంగుళూర్ ఎడిషన్‌లను తీసివేసినట్లు తెలుస్తుంది. అలాగే.. ఢిల్లీ, ముంబయి, లండన్, కలకత్తా కేంద్రంగా నడుస్తున్న ఏషియన్ ఏజ్ కు సంబంధించి కలకత్తా ఎడిషన్‌ను కూడా మూసివేసింది.
ఇక, డీసీహెచ్ఎల్‌కు కామధేనువు లాంటి తెలంగాణ ఎడిషన్‌లు అయిన హైద్రాబాద్, కరీంనగర్ లను మరింత పటిష్టం చేసే విధంగా సంస్థ ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తుంది. సంస్థ ఒకప్పుడు ఎక్కడైతే బలమైన పునాదులను నిర్మించుకుని దేశవ్యాప్తంగాఎడిషన్లను విస్తరించిందో నష్టాల రీత్యా మరలా అక్కడికే చేరుకుంది.
అలాగే ఆంధ్రప్రదేశ్ ఎడిషన్‌లకు సంబంధించి వైజగ్, విజయవాడ, రాజమండ్రి, నెల్లూరు, అనంతపురం లలో దక్కన్ క్రానికల్ నడుస్తుండగా.. కేవలం వైజాగ్, విజయవాడలలో మాత్రమే పేపర్ సర్క్యూలేషన్, యాడ్ బిజినెస్ సంస్థ మనగలిగే స్థితిలో ఉన్నట్లు.. మిగతా ప్రాంతాలకు సంబంధించిన ఎడిషన్లకు త్వరలో తిలోధకాలు ఇవ్వనున్నట్లు సమాచారం. అలాగే తమిళనాడు కేంద్రంగా చెన్నై, కోయంబత్తూరు, మధురై, తిరుచ్చి ఎడిషన్‌లను నడుపుతుంది. వీటి విషయంలో కూడా సంస్థ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుదోనని వార్తలు వెలువడుతున్నాయి.
డీసీహెచ్ఎల్ గ్రూపుకు సంబంధించిన మరోపత్రిక ఆంధ్రభూమి పరిస్థితి కూడా అంత ఆశాజనకంగా లేదు. 1960వ సంవత్సరం నుండి నడుస్తూ జర్నలిజంలో క్రమక్రమేణా ఎదిగి బలమైన సంస్థగా ఆవిర్భవించిన ఆంధ్రభూమి గత వైభవాన్ని కోల్పోయింది. ఆరు దశాబ్దాలుగా రెండు రాష్ట్రాలలో ఓ వెలుగు వెలిగిన ఆంధ్రభూమి.. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, అనంతపురం, కరీంనగర్, నెల్లూరు ఎడిషన్‌లను మాత్రమే రన్ చేస్తుంది.