15 ఏళ్లలో నలుగురికి మాత్రమే ఉరిశిక్ష
By సుభాష్ Published on 11 Jan 2020 4:22 PM IST
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసు దోషులకు ఈ నెల 22న కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఏడేళ్ల నిరీక్షణకు తెరదించినట్లయింది. దోషులైన అక్షయ్ కుమార్ (31) పవన్ గుప్తా (25) వినయ్ శర్మ (26) ముఖేష్ సింగ్ (32)లకు ఈనెల 22న, ఉదయం 7 గంటలకు తీహార్ జైల్లో ఉరి తీయనున్నారు. తొలిసారిగా ఒకే సారి నలుగురిని ఉరి తీయనున్నారు. అందుకు సంబంధించి ఉరితాళ్లు, ఇతర ఏర్పాట్లన్ని పూర్తయ్యాయి. నేపథ్యంలో గత 15 ఏళ్లలో దేశంలో నలుగురికి మాత్రమే ఉరిశిక్షలు అమలు చేసినట్లు జాతీయ నేర విభాగం గణాంకాలు చెబుతున్నాయి. మొత్తం 400 మందికి కోర్టులు ఉరి శిక్ష విధించగా, అందులో కేవలం ఒక శాతం మాత్రమే ఉరిశిక్షలు అమలైనట్లు తెలుస్తోంది.
నిర్భయ దోషులతో ఈ సంఖ్య 8కి చేరింది:
ఇదిలా ఉండగా, గణాంకాల ప్రకారం..ఈ పదిహేనేళ్లలో మరణ శిక్ష విధించిన సుమారు 1200 మంది శిక్షను ఆ తర్వాత జీవిత ఖైదుగా మార్చినట్లు రికార్డులు చెబుతున్నాయి. నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు చేస్తున్న నేపథ్యంలో ఎన్‌సీఆర్‌బీ గణాంకాలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ కేసుల్లో సుదీర్ఘకాల విచారణ, రాష్ట్రపతి అభ్యర్థనలు కారణంగానే శిక్ష అమలు చేయడంలో జాప్యం జరుగుతోన్నట్లు తెలుస్తోంది. గత 15 సంవత్సరాల్లో ఉరిశిక్ష అమలు చేసింది కేవలం నలుగురికి మాత్రమేనని తెలుస్తోంది. బాలికపై అత్యాచారం కేసులో పశ్చిమ బెంగాల్‌కు చెందిన ధనుంజయ్, ముంబాయిలో జరిగిన ఉగ్రదాడిలో కీలక పాత్ర పోషించిన పాకిస్తాన్ ఉగ్రవాది కసబ్, ఇక పార్లమెంట్‌పై దాడికి పాల్పడిన అప్జల్ గురు,1993లో ముంబాయి పేలుళ్లలో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో ప్రధాన నిందితుడైన యాకూబ్ మెమన్‌లకు మాత్రమే ఉరిశిక్షను అమలు చేశారు. ఇక నిర్భయ కేసులో నలుగురు ఉరిశిక్షతో ఈ సంఖ్య 8కి చేరింది.
ఇక 2012, డిసెంబర్ 16న ఢిల్లీలో నిర్భయపై జరిగిన అత్యాచారం కేసులో మొత్తం ఆరుగురి నిందితులను పోలీసులు అరెస్ట్ చేయగా, అందులో ఒకరు తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మరో నిందితుడి మైనర్‌గా భావించి మూడు సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించారు. ఇక మిగిలిన నలుగురికి గతంలోనే ఉరిశిక్ష విధించగా, ఆ తీర్పును ఢిల్లీ కోర్టు తోసిపుచ్చింది. ఆ తర్వాత తమకు క్షమాభిక్ష ప్రసాదించాలని పిటిషన్ దాఖలు చేయగా, ఢిల్లీ ప్రభుత్వం తిరస్కరించగా, రాష్ట్రపతి కూడా ఆ పిటిషన్‌లను తిరస్కరించారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన దిశ ఘటనతో దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. నిర్భయ నిందితులకు కూడా ఉరి శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. దీంతో నిర్భయ కేసు విచారణ వేగవంతమైంది. ఇటీవల ఢిల్లీ పటియాల కోర్టులో తుది తీర్పు వెలువరించింది. నలుగురి దోషులకు ఉరిశిక్ష సంచలన తీర్పునిచ్చింది. ఈనెల 22న ఉదయం 7 గంటలకు తీహార్ జైల్లో ఉరితీయాలని జైలు అధికారులను ఆదేశించింది కోర్టు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఉరిశిక్ష విధించేందుకు తగిన ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు జైలు అధికారులు. గతంలో అప్జల్ గురుకు ఉరిశిక్ష విధించిన మూడో నెంబర్ కారాగారంలో ఈ నలుగురికి కూడా ఉరి వేయనున్నారు.