దేశ చరిత్రలోనే ఇలా ఉరితీయడం తొలిసారి..
By రాణి Published on 20 March 2020 3:09 PM ISTనిర్భయ. ఆ పదం వింటేనే 8 ఏళ్ల క్రితం నిర్భయ పై జరిగిన అత్యాచార ఘటన గుర్తొస్తుంది ఎవరికైనా. నిర్భయపై అతిక్రూరంగా సామూహిక అత్యాచారం జరగడంతో యావత్ దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ తర్వాత నిర్భయ అనే చట్టం చేసి..అమలులోకి తీసుకొచ్చింది అప్పటి ప్రభుత్వం. ఎవరైనా మహిళలపట్ల అసభ్యంగా ప్రవర్తించినా, అత్యాచారం చేసినా ఈ చట్టం కింద ఒక్కసారి కేసు నమోదైందంటే వారు బయటికి వచ్చే అవకాశాలు తక్కువ.
ప్రపంచంలో అత్యంత ఘోరమైన నేరాల్లో నిర్భయ అత్యాచార ఘటన కూడా ఒకటి. ఈ కేసులో ఉన్న దోషులకు ఉరిశిక్ష విధించాలని నిర్భయ తల్లి 8 ఏళ్లుగా చేసిన పోరాటం ఎట్టకేలకు ఫలించింది. శుక్రవారం ఉదయం 5.30 నలుగురు నిందితుల్ని ఉరితీసి 30 నిమిషాలపాటు ఉరికంభాలకే ఉంచారు. అనంతరం పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే ఒకేసారి నలుగురిని ఉరి తీయడం దేశచరిత్రలోనే ఇది తొలిసారి కావడం గమనార్హం.
Also Read : నెలరోజుల్లో భూమి అంతమవ్వనుందా ? నాసా ఏం చెప్తోంది ?
అయితే..మనదేశంలో ఉరిశిక్ష విధించడం చాలా అరుదు. 1949లో మనదేశంలో మొట్టమొదటి సారిగా ఉరిశిక్షను అమలు చేశారు. ఇప్పటి వరకూ ఎవరెవర్ని ఎప్పుడెప్పుడు ఉరితీశారో ఇప్పుడు తెలుసుకుందాం.
గాంధీ, ఇందిరాగాంధీ హత్యల కేసుల్లోనూ ఉరిశిక్షలు
1949లో గాంధీని హత్య చేసిన కేసులో దోషిగా నిర్థారణయ్యాక నాథూరామ్ గాడ్సేను ఉరితీశారు. ఈ కేసులోనే మరో కుట్రదారుడైన నారాయణ్ ఆప్టేని కూడా ఉరితీశారు. ఆ తర్వాత 1989లో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్య కేసులో దోషులైన సత్వంత్ సింగ్, ఖేహర్ సింగ్ లకు మరణశిక్ష అమలు చేశారు. ఆ తర్వాత వరుస హత్యలకు పాల్పడిన ఆటో శంకర్ అలియాస్ గౌరీ శంకర్ అనే వ్యక్తిని 1995లో ఉరితీశారు. 2004లో మైనర్ బాలికపై అత్యాచారం, హత్య కేసులో దోషిగా తేలిన ధనుంజయ్ ఛటర్జీకి మరణశిక్ష వేశారు. 2008లో ముంబై ఉగ్రదాడిలో పట్టుబడిన ముష్కరుడు అజ్మల్ కసబ్ ను 2012, నవంబర్ 12న ఉరి తీశారు.
Also Read : బిగ్ బ్రేకింగ్ : తెలంగాణలో పదోతరగతి పరీక్షలను వాయిదా వేయాలని హైకోర్టు ఆదేశం
అదేవిధంగా పార్లమెంట్ పై దాడి చేసేందుకు కుట్రపన్నిన అఫ్జల్ గురు ను 2013 ఫిబ్రవరి 8వ తేదీన ఉరితీశారు. 1993 ముంబై పేలుళ్లలో కీలక పాత్ర పోషించిన యాకూబ్ మెమన్ ను 2015 జూలై 30వ తేదీన నాగ్ పూర్ సెంట్రల్ జైలులో ఉరితీశారు. నిర్భయ దోషుల ఉరితీత కన్నా ముందు జరిగిన ఉరిశిక్ష ఇదే.
కాగా..ఢిల్లీలోని నేషనల్ లా యూనివర్శిటీ సేకరించిన వివరాల ప్రకారం ఇప్పటి వరకూ స్వతంత్ర భారతదేశంలో సుమారు 755 మందిని ఉరి తీసినట్లు తెలుస్తోంది. ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండివచ్చునన్న అనుమానం కూడా ఉంది. చాలామంది దోషులకు ఉరిశిక్ష వేసినప్పటికీ అందుకు సంబంధించిన రికార్డులు లేకపోవడంతో ఎంతమందికి ఉరిశిక్ష పడిందన్న విషయంపై సరైన స్పష్టత లేదని ఎన్ఎల్ యూ తెలిపింది. తాము సేకరించిన వివరాల ప్రకారం ఇప్పటి వరకూ ఎక్కువగా ఉరిశిక్షలు ఉత్తర్ ప్రదేశ్ లో అమలు చేసినట్లు చెప్పారు.
ఏయే నేరాలకు ఉరిశిక్ష ?
భారత్ లో హత్య, హత్యాయత్నం, హత్యాచారం, సామూహిక అత్యాచారం, దేశద్రోహం, సైన్యంలో తిరుగుబాటు, డ్రగ్స్ సరఫరా లాంటి తీవ్రమైన నేరాలకు ఉరిశిక్షలు వేస్తున్నారు. ఐపీసీ వివిధ సెక్షన్ల కింద ఈ శిక్షలను విధించవచ్చు.