విషాదం.. దిగ్గజ క్రికెటర్ డీన్‌జోన్స్ కన్నుమూత
By తోట వంశీ కుమార్ Published on 24 Sept 2020 4:22 PM ISTక్రికెట్ ప్రపంచంలో విషాదం నెలకొంది. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డీన్‌జోన్స్ గుండెపోటుతో గురువారం కన్నుమూశారు. యూఏఈలో జరుగుతున్న ఐపీఎల్ 2020 లీగ్‌లో స్టార్‌స్పోర్స్ తరుపున ఆయన వ్యాఖ్యతగా కొనసాగుతున్నారు. అందుకోసం ఆయన ప్రస్తుతం ముంబైలోని ఓ హోటల్‌లో బస చేస్తున్నారు. మధ్యాహ్నం కూడా ఎంతో నార్మల్‌గానే కనిపించారు. ఆఫీస్‌కి వచ్చి అందరినీ పలకరించారు. హఠాత్తుగా కుప్పకూలిపోవడంతో దగ్గరలోని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.
డీన్‌జోన్స్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. నిన్న మ్యాచ్ అనంతరం కూడా ఓ అభిమాని ఆవేశంగా ట్వీట్ చేసినా.. కూడా కూల్‌గా సమాధానం ఇచ్చారు. ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో 24 మార్చి 1961లో జన్మించారు. టెస్టుక్రికెట్‌లో రికార్డులు నెలకొల్పాడు. 52 టెస్టుల్లో 46.55 సగటులో 3,631 పరుగులు చేశారు. అందులో 11 శతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 216. వన్డేల్లో 164 మ్యాచ్‌లు ఆడి 44.6సగటుతో 6,068 పరుగులు చేశారు. అందులో 7 శతకాలు ఉన్నాయి. అంతేకాదు ఫస్టుక్లాస్ క్రికెట్‌లో 19వేలకు పైగా, లిస్టు ఏ క్రికెట్‌లో 10వేలకు పైగా పరుగులు చేశారు.
క్రికెట్ నుంచి వీడ్కోలు పలికాక వ్యాఖ్యతగా కెరీర్ కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ఇస్లామాబాద్ యూనైటెడ్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించారు. 2016లో ఆ జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన మృతి పట్ల పలువురు క్రికెటర్లు సంతాపం వ్యక్తం చేశారు.