భారత క్రికెట్ చరిత్రలో ఈ రోజు ఎంతో ప్రత్యేకం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Sep 2020 10:36 AM GMT
భారత క్రికెట్ చరిత్రలో ఈ రోజు ఎంతో ప్రత్యేకం

భారత క్రికెట్ చరిత్రలో ఈ రోజు ఎంతో ప్రత్యేకం. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సారథ్యంలో టీ20 ప్రపంచకప్‌ గెలిచి సరిగ్గా ఈ రోజుకు 13 ఏళ్లు. 13 ఏళ్ల క్రితం అంటే.. 2007 సెప్టెంబర్ 24న భారత్ మొదటిసారి టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడింది. ఫైనల్‌లో దాయాది పాకిస్థాన్‌ను ఓడించింది. 1983లో టీమిండియా మాజీ దిగ్గజం కపిల్‌ దేవ్‌ నేతృత్వంలో తొలిసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది. ఆ తర్వాత భారత్‌కు మరో ప్రపంచకప్‌ రావడానికి 24 ఏళ్ల సమయం పట్టింది. 13ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా.. పలువురు క్రికెట్‌ అభిమానులు ఆనాటి విజయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. బీసీసీఐ కూడా ఈ ప్రత్యేక విజయాన్ని గుర్తుచేస్తూ.. ఆనాటి మ్యాచ్‌ ఫోటోను అభిమానులతో పంచుకుంది. '2007లో ఈ రోజున టీమిండియా ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది' అని కాప్షన్ పెట్టింది.

అనుభవం లేని ఆటగాళ్లు.. కోచ్‌ లేని జట్టు.. జట్టుకు సారధి కొత్తవాడే. దీంతో టీమ్‌పై పెద్దగా అంచనాలు కూడా ఏమీ లేవు. మరోవైపు సచిన్‌, ద్రవిడ్‌, గంగూలీ, కుంబ్లే లాంటి దిగ్గజ ఆటగాళ్లు లేనప్పటికీ.. ధోనీ టీమిండియాను ముందుండి నడిపించాడు. మొత్తం కుర్రాళ్లతో నిండిన జట్టుతో ధోనీ ప్రయోగాలు చేసాడు. లీగ్‌ దశలో పాకిస్థాన్‌తో బౌలౌట్‌ మొదలుకొని ధోని పట్టిందల్లా బంగారం అయ్యింది. ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో యువరాజ్‌ ఒక ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టిన దానిని ఎవరూ అంత త్వరగా మరచిపోరు. పాపం యువరాజ్‌ ధాటికి బలైంది సువర్ట్‌బ్రాడ్‌. ఇర్ఫాన్ పఠాన్, జోగిందర్ శర్మ, ఆర్పీ సింగ్, శ్రీశాంత్ వంటి బౌలర్లు రాణించడంతో సెమీస్‌లో పటిష్ట ఆస్ట్రేలియాను ఓడించి భారత్ ఫైనల్‌కు చేరింది.

ఫైనల్‌లో చిరకాల ప్రత్యర్థి పాక్‌తో భారత్ తలపడింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఓపెనర్ గౌతమ్‌ గంభీర్‌ 75(54 బంతుల్లో 4పోర్లు, 2 సిక్సర్లు) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఉతప్ప (8), యువరాజ్ (14), ధోనీ (6), యూసుఫ్ పఠాన్‌(15) విఫలమయ్యారు. ఇన్నింగ్స్ చివరలో రోహిత్ శర్మ 30(16 బంతుల్లో 2పోర్లు, 1సిక్సర్‌) ధాటిగా బ్యాటింగ్‌ చేయడంతో.. పాక్‌ ముందు భారత్‌ గౌరవప్రదమైన స్కోర్‌ ఉంచింది. పాక్ పేసర్ ఉమర్ గిల్ మూడు వికెట్లు తీసాడు. లక్ష్య ఛేదనకు దిగిన పాక్‌ తడబడుతూ విజయానికి చేరువగా వచ్చింది. ఇక చివరి ఓవర్‌లో పాక్ 13 పరుగులు చేయాల్సి ఉంది. భారత్‌కు కావాల్సింది ఒక వికెట్‌. తొలిబంతి వైడ్‌.. రెండో బంతి డాట్‌.. తర్వాతి బంతి సిక్సర్‌.. నాలుగు బంతుల్లో 6 పరుగులు కావాలి. ఇంకేముంది భారత్‌ గెలుస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. మూడో బంతికి మిస్బా ఆడిన స్కూప్‌ షాట్‌కు బంతి నేరుగా వెళ్లి ఫైన్‌లెగ్‌లో ఉన్న శ్రీకాంత్‌ చేతిలో పడింది. దీంతో భారత్ విజేతగా నిలిచింది. ధోనీ తన షర్ట్ విప్పి ఓ కుర్రాడికి బహుమతిగా ఇచ్చాడు. ఆ మ్యాచ్‌లో ఇర్ఫాన్‌ పఠాన్‌ నాలుగు ఓవర్లలో కేవలం 16 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీసి భారత విజయంలో కీలక పాత్ర పోషించడంతో.. మ్యాన్‌ ఆప్‌ ది మ్యాచ్‌ అందుకున్నాడు.

Next Story