ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 29 Oct 2019 12:37 PM ISTవిజయనగరం: పర్యాటక ప్రాంతాన్ని సందర్శించేందుకు వెళ్లిన ఓ కుటుంబంలో విషాదం మిగిలింది. నెల్లిమర్లలోని మిమ్స్ మెడికల్ కళాశాలలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న సునీత కుటుంబం విహార యాత్ర కోసం ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్‌కు రెండు రోజుల క్రితం వెళ్లారు. డాక్టర్ సునీత, భర్త లక్ష్మణరావు, వారి కుమార్తె శ్రేయ, కుమారుడు, సునీత సోదరుడు రమేష్, విశాఖపట్నానికి చెందిన తిరుమల రావు కుటుంబసభ్యులు మరో ముగ్గురు విశాఖపట్నం నుంచి విశాఖ - కిరండూల్ రైలులో జగదల్ పూర్ వెళ్లారు. అక్కడ పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు స్థానికంగా ఓ కారును బుక్ చేసుకున్నారు. ఆ కారులో వెళ్లి చిత్రకోట జలాశయాన్ని సందర్శించి ఆహ్లాదంగా గడిపారు. అలాగే దంతెవాడలోని దంతేశ్వరి ఆలయాన్ని దర్శించుకున్నారు.
తిరుగు ప్రయాణానికి జగదల్ పూర్ రైల్వేస్టేషన్‌కు వచ్చేందుకు సోమవారం అదే కారులో అందరూ బయల్దేరారు. అయితే కారు డ్రైవర్ పూర్తి మద్యం మత్తులో ఉండడంతో మార్గం మధ్యలో ఓ చెట్టును ఢీకొట్టాడు. దీంతో కారు మొత్తం నుజ్జునుజ్జు కాగా సంఘటనా స్థలంలో లక్ష్మణారావు, కుమార్తె శ్రేయ ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రులను జగదల్ పూర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో రమేష్, తిరుమలరావు మృతి చెందారు. మరో ఇద్దరు క్షతగాత్రులు డాక్టర్ సునీత, తిరుమలరావు కుటుంబానికి చెందిన ఓ మహిళ తీవ్రంగా గాయపడడంతో విశాఖపట్నం తరలిస్తుండగా డాక్టర్ సునీత మృతిచెందారు. స్కార్పియో డ్రైవర్ పవన్ నెట్టం జగదల్‌పూర్ కళాశాల ఆస్పత్రిలో తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నాడు.