డిజిటల్ టెక్నాలజీతో ఏజ్ తగ్గించుకుంటున్న స్టార్లు..
By Newsmeter.Network Published on 22 Dec 2019 8:03 AM GMTముఖ్యాంశాలు
- డీ ఏజింగ్ టెక్నాలజీతో స్టార్లకు యంగ్ లుక్
- సైరా సినిమాలో చిరంజీవి లుక్ కు ఇదే కారణం
- దశాబ్దాల వయసును వెనక్కి నెట్టేసే డీ ఏజింగ్ టెక్నాలజీ
- దాదాపుగా స్టార్లంతా ఇప్పుడు దీనిపై ఆధారపడుతున్నారు
- కానీ ఇది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం
- నిమిషానికి రూ.3 నుంచి రూ.15 లక్షలు ఖర్చు
ఒకప్పుడు యాక్టర్లు తమ గ్లామర్ ని కాపాడుకోవడానికి నానా తిప్పలూ పడాల్సొచ్చేది. ఫిగర్ ని, అందాన్నీ కాపాడుకోవడానికి నోరు కట్టేసుకుని, ఇష్టాలన్నింటినీ దాచి.. పెట్టెలో పెట్టేసుకుని బతకాల్సొచ్చేది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం పుణ్యమా అని ఇప్పుడు ఈ నవశకంలో అలాంటి బాధలేం లేవు. ఎవరు ఎలాగైనా సరే ఇష్టంగా, సుష్టుగా తినొచ్చు, ఇష్టంవచ్చినట్టు ఉండొచ్చు. రిస్ట్రిక్షన్లు ఏమీ లేవు. ఎందుకంటే డిజిటల్ టెక్నాలజీ పుణ్యమా అని ఎవరిని ఎలాగైనా చూపించడానికి వీలవుతుందికనుక.
డిజిటల్ టెక్నాలజీ ఇప్పుడు సినిమా రంగాన్ని ఏలుతోంది. అన్ని సినిమాల్లోనూ గ్రాఫిక్స్ మాయాజాలాన్ని చొప్పించేందుకు కాస్తోకూస్తో ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. బాహుబలి లాంటి భారీ బడ్జెట్ సినిమాల్లో అయితే గ్రాఫిక్స్ మాయాజాలం ఏ స్థాయిలో ఉందో చెప్పాల్సిన పనేలేదు. అయితే ఇప్పుడు సీనియర్ యాక్టర్ల లుక్ విషయంలో ఈ సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో ఉపయోగపడుతోంది.
సైరా నరసింహారెడ్డి సినిమాలో మెగాస్టార్ చిరంజీవి పొట్టను, ఫ్లాట్ గా అందంగా కనిపించేట్టుగా చేసింది ఈ టెక్నాలజీనే. దీని సాయంతో యాక్టర్ల వయసునూ సగానికి సగం తగ్గించేయొచ్చు. కాలంతోపాటుగా పెరిగే వయసు, దానివల్ల ఆహార్యంలో వచ్చే సహజమైన మార్పులను ఇప్పుడు యాక్టర్లు ఈజీగా ఇగ్నోర్ చేయొచ్చు.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కారణంగానే
ఈ టెక్నాలజీ సాయంతో వాటిని పూర్తిగా మ్యానేజ్ చేయొచ్చుకనుక ఎలాంటి ఇబ్బందీ లేదు. ఈ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కారణంగానే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, రవితేజ, నాగార్జున, విజయశాంతి, రాజశేఖర్ లాంటి సీనియర్ యాక్టర్లు ఇంకా డాషింగ్ గా కనిపిస్తూ వెండితెరమీద ప్రేక్షకుల్ని సమ్మోహితుల్ని చేస్తున్నారు.
ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్లను అందంగా చూపించేందుకు ఈ టెక్నాలజీని ఏదో ఒక సందర్భంలో వాడుతూనే ఉన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చారిత్రక నేపధ్యం కలిగిన సైరా నరసింహారెడ్డి సినిమాపై చిరంజీవి అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అంచనాలకు అనుగుణంగానే సైరాలో చిరంజీవి లుక్ అందర్నీ ఆకట్టుకుంది. వయసు పెరిగిన తర్వాతకూడా మెగాస్టార్ ఈ సినిమాలో యంగ్ లుక్ లో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి లోను చేశారు.
ముఖ్యంగా ఈ డిజిటల్ టెక్నాలజీ సాయంతోనే ఈ సినిమాలో చిరంజీవి పొట్టను ఫ్లాట్ గా, ఫిట్ గా చూపించడంలో టెక్నీషియన్లు సక్సెస్ సాధించారు. మరో స్టార్ నందమూరి బాలకృష్ణకూడా తన కొత్త సినిమా రూలర్ లో డిజిటల్ టెక్నాలజీ సాయంతోనే వినూత్నంగా కనిపించారు. ముడతలు పడిన చర్మాన్ని, జారిన దవడల్ని సరిచేసి పూర్తి స్థాయిలో యంగ్ లుక్ తీసుకురావడానికి ఈ టెక్నాలజీ ఇప్పుడు ఎంతగానో దోహదపడుతోందని టెక్నీషియన్లు అంటున్నారు.
నటనలో పరిణతి ఎలాగూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుని తీరుతుంది. దానికి యంగ్ లుక్ కూడా తోడైతే ఫాలోయింగ్ మరింత పెరుగుతుంది. ఈ కారణంగా దాదాపు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి స్టార్ కీ, నటీనటులకూ ఇప్పుడీ టెక్నాలజీ బాగా అవసరమవుతోంది. ఈ టెక్నాలజీని ఉపయోగించడంవల్ల నటీనటుల సినీనట జీవితాన్ని మరికొంతకాలం అలాగే మెయిన్ టెయిన్ చేసే అవకాశం ఉంటుందన్నది తాజా చిత్రాల్లో నిరూపితమైన అంశం.
జీరో సైజ్ సినిమాకోసం విపరీతంగా లావెక్కిన తెలుగు స్టార్ అనుష్క ఒక రకంగా కేవలం ఆ ఒక్క సినిమాకోసం సాహసం చేసిందనే చెప్పాలి. జీరో సైజ్ పూర్తైన తర్వాత మళ్లీ తను సన్నబడి మెరుపుతీగలా మారేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి పూర్తి స్థాయిలో సక్సెస్ కావడంలేదు.
అనుష్కను మల్లెతీగలా అందంగా
దీర్ఘకాలంపాటు తెరకెక్కించిన బాహుబలి చిత్రంలో ఆమెను అందంగా కనిపించేలా చేయడానికి డిజిటల్ టెక్నాలజీని వాడాల్సొచ్చింది. దీని సాయంతోనే బాగా లావుగా ఉన్న అనుష్కను ఆ సినిమాలో తెరమీద జాజి పువ్వులా సన్నగా కనిపించేలా చేయగలిగారు. కొత్తగా విడుదలయ్యే మరో సినిమాలోకూడా డిజిటల్ టెక్నాలజీ సాయంతోనే అనుష్కను మల్లెతీగలా అందంగా కనిపించేలా చేయగలిగారు.
ఇక నవతరం స్టార్లు రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు, ప్రభాస్, రాజ్ తరుణ్ లాంటివాళ్లు ఈ డిజిటల్ టెక్నాలజీ సాయంతోనే వెండితెరమీద మిలమిలా మెరుస్తున్నారు. డిజిటల్ మేకప్ సాయంతో స్టార్ల ముఖాలమీద ఒక్క ముడతకూడా లేకుండా చేసే అవకాశం ఉండడంవల్ల ప్రస్తుతం స్టార్లంతా ఈ టెక్నాలజీని ఉపయోగించాల్సిందిగా నిర్మాతలపై ఒత్తిడిని పెంచుతున్నారుకూడా.
చాలా ఖర్చుతోకూడిన వ్యవహారం
కానీ స్టార్లు యంగ్ లుక్ లో కనిపించడానికి ఈ డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించాలంటే అదేం అషామాషీ వ్యవహారం కాదు. చాలా ఖర్చుతోకూడుకున్నపనే. ఒక టాప్ యాక్టర్ కి ఈ డిజిటల్ టెక్నాలజీ సాయంతో తెరమీద యంగ్ లుక్ తెప్పించాలంటే, ముంఖంలో ముడతల్ని మాయం చేయాలంటే, జారిన దవడల్ని సరిచేయాలంటే కనీసం నిమిషానికి మూడు లక్షల నుంచి పదిహేను లక్షల రూపాయలవరకూ ఖర్చుపెట్టాల్సొస్తుంది.
లేడీ మెగాస్టార్ విజయశాంతి నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరులో ఆమె అందంగా కనిపించేందుకు, యంగ్ లుక్ తీసుకొచ్చేందుకు డీ ఏజింగ్ డిజిటల్ టెక్నాలజీని వాడినట్టు సినీవర్గాల భోగట్టా. నిజానికి ఇప్పటికీ చాలామంది యాక్టర్లు ఇష్టంవచ్చినట్టు తిని, ఇష్టారాజ్యంగా ఫిగర్ ను పాడుచేసుకోవడానికి ఏమాత్రం ఇష్టపడట్లేదు. అయితే వయసు పెరగడంవల్ల వచ్చిన ఇబ్బందులను తొలగించుకోవడానికి, యంగ్ లుక్ కోసం డీ ఏజింగ్ టెక్నాలజీపై ఆధారపడక తప్పడం లేదు.