వార్న‌ర్ ఖాతాలో మ‌రో రికార్డ్..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  14 Dec 2019 12:10 PM GMT
వార్న‌ర్ ఖాతాలో మ‌రో రికార్డ్..!

బాల్ టాంప‌రింగ్ ఆరోప‌ణ‌ల‌తో కొద్దికాలం పాటు క్రికెట్ కు దూర‌మైన వార్న‌ర్.. పున‌రాగ‌మ‌నం త‌ర్వాత త‌న స‌త్తా చాటుతున్నాడు. పాక్‌తో జ‌రిగిన టెస్టులో సిరీస్‌లో ట్రిపుల్ సెంచ‌రీ సాధించి ఊపుమీదున్న వార్న‌ర్.. స్వ‌దేశంలో పెర్త్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో కూడా ఓ రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు.

వార్న‌ర్.. టెస్టుల్లో 7వేల‌ పరుగుల మైలురాయిని దాటాడు. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో డేవిడ్ వార్నర్ ఈ ఫీట్‌ను అందుకున్నాడు. మూడో రోజు ఆటలో వార్నర్‌ 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్న‌ప్పుడు టెస్టుల్లో 7వేల పరుగుల్ని పూర్తి చేసుకున్నాడు. ఫలితంగా టెస్టుల్లో 7వేల పరుగులు పూర్తి చేసుకున్న 12వ ఆస్ట్రేలియా క్రికెటర్‌గా డేవిడ్ వార్నర్ నిలిచాడు.

వార్నర్‌ 151 ఇన్నింగ్సుల‌లో ఈ మైలురాయిని అందుకున్నాడు. దీంతో వేగంగా 7వేల పరుగులు సాధించిన ఆసీస్‌ క్రికెటర్ల జాబితాలో గ్రెయిగ్‌ చాపెల్‌తో కలిసి ఐదో స్థానంలో నిలిచాడు.

ఇదిలావుంటే.. ఇటీవ‌ల‌ పాక్‌తో జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో స్టీవ్ స్మిత్ 126 ఇన్నింగ్సుల్లో 7వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. దీంతో రోజుల గ్యాప్‌లోనే ఇద్ద‌రు అసీస్ ఆట‌గాళ్లు ఈ మైలురాయిని దాటారు. అంతేకాదు ఈ ఏడాది టెస్టుల్లో అత్య‌ధిక‌ పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో ఆసీస్‌ క్రికెటర్లు లబూషేన్‌(972) స్టీవ్‌ స్మిత్‌(857)లు తొలి రెండు స్థానాల్లో ఉండగా, డేవిడ్‌ వార్నర్‌ ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు.

Next Story
Share it