రంజీ క్రికెట్ చ‌రిత్ర‌లో జార్ఖండ్ జట్టు అరుదైన ఘనత‌ సాధించింది. 85 సంవత్సరాల సుదీర్ఘ చ‌రిత్ర గ‌ల భార‌త‌ రంజీ క్రికెట్ చరిత్రలో ఫాలో ఆన్ ఆడి ఫస్ట్-క్లాస్ మ్యాచ్.. గెలిచిన ఏకైక జట్టుగా జార్ఖండ్ చరిత్ర సృష్టించింది. వివ‌రాళ్లోకెళితే.. 2019-20 రంజీ సీజన్ గ్రూప్ – సీ మ్యాచ్‌లో భాగంగా జార్ఖండ్-త్రిపుర జట్ల మధ్య నాలుగు రోజుల‌ మ్యాచ్ జరిగింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన‌ జార్ఖండ్.. త్రిపురని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. బ్యాటింగ్‌కు దిగిన‌ త్రిపుర తొలి ఇన్నింగ్స్‌లో 289 పరుగులు చేసింది. త్రిపుర ఇన్నింగ్సులో కెప్టెన్‌ మిలింద్(59), హర్మీత్ సింగ్(56) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇక‌ జార్ఖండ్ జట్టు బౌల‌ర్లు అజయ్ యాదవ్, ఆశిష్ కుమార్ తలో 3 వికెట్లు తీయగా.. అనుకుల్ రాయ్ 2, వివేక్ తివారికి ఒక వికెట్ ద‌క్కింది.

వెంట‌నే తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన‌ జార్ఖండ్.. 136 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో త్రిపురకు 153 పరుగుల తొలి ఇన్నింగ్సు ఆధిక్యం లభించింది. ఆటకు ఇంకా రెండు రోజులు మిగిలున్నా.. త్రిపుర కెప్టెన్ మిలింద్ జార్ఖండ్ జట్టును ఫాలోఆన్‌కు పిలిచాడు.

ఫాలోఆన్ ఆడేందుకు బ‌రిలోకి దిగిన‌ జార్ఖండ్ బ్యాట్స్‌మెన్‌ చెలరేగిపోయారు. ఇన్నింగ్సు ఆరంభించిన కొద్దిసేప‌టికే ఓపెనర్ల వికెట్లను కోల్పోయినప్పటికీ.. అనంత‌రం వ‌చ్చిన‌ సౌరబ్ తివారీ(190 బంతుల్లో 122, 8×4), ఇషాంక్ జగ్గీ(207 బంతుల్లో 107, 9×4, 2×6) సెంచరీలతో చెలరేగడంతో జార్ఖండ్ రెండో ఇన్నింగ్సును 418/8 వద్ద డిక్లేర్ చేసింది.

అనంతరం 265 ప‌రుగుల విజ‌యల‌క్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంబించిన‌ త్రిపుర జ‌ట్టు 211 పరుగులకు ఆలౌటైంది. త్రిపుర జట్టులో మురా సింగ్(103) ఒక్క‌డే సెంచరీతో ఒంట‌రి పోరాటం చేయ‌గా.. మిగతా వారంతా అలా వ‌చ్చి ఇలా వెళ్లారు. ఆఖరి ఓవర్ వరకు ఈ మ్యాచ్ ఫలితం ఇద్ద‌రితో దోబూచులాడ‌గా.. ఆశిష్ కుమార్ వేసిన ఆఖరి ఓవర్‌లో త్రిపుర బ్యాట్స్‌మన్ రానా దత్తా ఎల్బీగా వెనుదిరగడంతో జార్ఖండ్ విజయం సాధించింది. ఆశిష్ కుమార్ ఐదు వికెట్లతో రాణించాడు. ఫలితంగా 85 ఏళ్ల రంజీ చరిత్రలో ఫాలో ఆన్ ఆడి గెలిచిన ఏకైక జట్టుగా జార్ఖండ్ చరిత్ర సృష్టించింది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.