సుప్రీం కోర్టు సంచలన తీర్పు.. ఆడపిల్లలకు ఆస్తి హక్కు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Aug 2020 3:11 PM IST
సుప్రీం కోర్టు సంచలన తీర్పు.. ఆడపిల్లలకు ఆస్తి హక్కు

ఆడపిల్లలకు ఆస్తి హక్కు విషయంలో సుప్రీం కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఆడపిల్లలకు ఆస్తిలో సమాన వాటా పంచాల్సిందేనని స్పష్టం చేసింది. చట్టం అమల్లోకి వచ్చిన నాటికి తల్లి లేదా తండ్రి బతికి ఉన్నా.. లేకున్నా ఆడపిల్లలకు వారి ఆస్తులపై కుమారులతో సమానంగా హక్కు ఉంటుందని తేల్చి చెల్పింది. ఈ మేరకు జస్టిన్‌ అరుణ్‌ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తీర్పును వెలువరించింది.

ఆడపిల్లలకు ఆస్తిలో హక్కు కల్పించడంపై దాఖలైన పిటీషన్లపై విచారణ అనంతరం సుప్రీంకోర్టు ఈ మేరకు తీర్పు వినిపించింది. హిందూ వారసత్వ సవరణ చట్టం-2005 ప్రకారం.. ఈ తీర్పును వెల్లడించింది. 2005లో హిందూ వారసత్వ చట్టం-1956లో సవరణలను చేశారు. సవరణలతో కూడిన చట్టాన్ని 2005 సెప్టెంబర్ 9వ తేదీన పార్లమెంట్ ఆమోదించింది. తండ్రి సంపాదించిన ఆస్తిలో కుమార్తెలకు సమాన హక్కు ఉంటుందని ఇందులో పొందుపరిచారు. దీనికి సంబంధించిన పిటీషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. తాజాగా తన తీర్పును వెలువడించింది. సవరణ తేదీ నాటికి కుమారై జీవించి లేకున్నా.. ఆమె సంతానం చట్టపరంగా ఆమెకు రావాలసిన వాటాను కోరవచ్చు.

ఆడ పిల్లలకు ఆస్తి ఇచ్చే విషయంలో కొందరు తల్లి తండ్రులు పక్ష పాతం చూపిస్తున్నారు అనే ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కడే కొడుకు ఉంటే కొడుకుకి ఎక్కువ ఆస్తి ఉంచి ఆడపిల్లలకు 10 శాతం నుంచి 30 శాతం వరకే ఇస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కాగా.. కుమారుడితో సమానంగా కుమారైకు ఆస్తిలో హక్కును ప్రసాదించిన ఈ తీర్పు.. హిందూ అవిభక్త కుటుంబాల్లో ఆడపిల్లల ఆస్తి హక్కుపై ఇప్పటి వరకు ఉన్న సందిగ్థాన్ని తొలగించిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Next Story