బాల 'డేటా' సైంటిస్ట్ బహుపరాక్..!!

By Newsmeter.Network  Published on  30 Nov 2019 5:11 AM GMT
బాల డేటా సైంటిస్ట్ బహుపరాక్..!!

లుడో, స్నేక్స్ అండ్ లాడర్స్ ఆడుకునే వయసు ఆ బుజ్జాయిది. బుద్ధిగా బడికి వెళ్లి, వచ్చి, హోం వర్కు చేసి, బజ్జునే వయసు ఆ బుల్లోడిది. కానీ ఆ పాలుకారే పసివాడు ఏకంగా డేటా సైన్స్ సముద్రాన్ని శోధించి, ఒక చక్కటి ఉద్యోగాన్ని సాధించాడు. పట్టుమని పన్నెండేళ్లు కూడా లేకుండానే ప్లమ్ జాబ్ పొందేశాడు.

మణికొండ శ్రీ చైతన్య స్కూల్లో చదివే పన్నెండేళ్ల పిల్లి సిద్ధార్థ శ్రీవాస్తవ అనే అబ్బాయికి ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో డేటా సైంటిస్టు ఉద్యోగం వచ్చింది. చిన్నప్పట్నుంచీ సిద్ధార్థకి కంప్యూటర్లంటే పిచ్చి. ఆన్ లైన్ లో కోడింగ్ ను చేర్చుకున్నాడు. ఆ తరువాత ఆన్ లైన్ ట్యుటోరియల్స్ సాయంతో డేటా సైన్స్ ను ఔపోసన పట్టేశాడు. ఆ తరువాత ఉద్యోగాల కోసం ఆన్ లైన్ లో అప్లై చేయడం మొదలుపెట్టాడు. అతని పనిని చూసి కంపెనీలు ఆశ్చర్యంతో తలకిందులైపోయేవి. కానీ పిల్లవాడి వయసు చూసి ఉద్యోగం ఇవ్వడానికి జంకేవి. చివరికి తన తల్లి స్నేహితురాలి కుమారుడు అతని రెస్యూమె ను ఒక కంపెనీకి పంపించారు. ఆ కంపెనీ వారు అతని ప్రతిభకు ఆశ్చర్యపోయారు. తరువాత గౌరవ వేతనంపై డేటా సైంటిస్టు ఉద్యోగం ఇచ్చారు.

సిద్ధార్థకు పనిచేయాలంటే ఎలాంటి జంకూ గొంకూ లేవు. తనకు ఎలాంటి టెన్షనూ లేదంటున్నాడు. అతని తల్లీ తండ్రీ సాఫ్ట్ వేర్ ఉద్యోగులే. ఇప్పుడతను వారానికి మూడు రోజులు ఉద్యోగం చేస్తాడు. మూడు రోజులు బడికెళ్తాడు. ఈ బాల డేటా సైంటిస్ట్ కి బహుపరాక్!!

Next Story