డేంజర్‌ జోన్‌లో హైదరాబాద్‌

By సుభాష్  Published on  6 July 2020 12:09 PM IST
డేంజర్‌ జోన్‌లో హైదరాబాద్‌

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. మరణాల రేటు తక్కువగా ఉన్నప్పటికీ ప్రతి రోజు కేసుల సంఖ్య అమాంతంగా పెరిగిపోతోంది. ఇక తెలంగాణలోని ఇతర జిల్లాల కంటే ఒక్క హైదరాబాద్‌జీహెచ్‌ఎంసీ పరిధిలో కేసులు తీవ్రంగా నమోదవుతున్నాయి. ఇప్పుడు కరోనా వైరస్‌ను అరికట్టడంలో అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది. నెల రోజుల నుంచి జూన్‌ 5న తెలంగాణలో 3290 కేసులుండగా, మరణాలు 113 ఉండేవి. జూలై 6వ తేదీ నాటికి ఆ సంఖ్య 24వేలు దాటిపోయింది.

రాష్ట్రంలో కరోనా పరీక్షలు పెంచడంతో నెల రోజుల్లోనే భారీగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి.ఇటీవల కాలంలో కేసులు తక్కువగా నమోదైనా.. లాక్‌డౌన్‌ నుంచి సడలింపులు ఇవ్వడంతో కేసుల ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. గత మూడు, నాలుగు రోజుల నుంచి ప్రతిరోజు కేసులు 1500 దాటిపోగా, ఆదివారం 1590 కేసులు నమోదయ్యాయి.అంతకు ముంద రెండు రోజులు వరుసగా 1800 వరకు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 11వేల వరకు కేసులు యాక్టివ్‌లో ఉండగా, 12,705 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రతి రోజు నమోదయ్యే కేసుల్లో 90శాతం వరకు హైదరాబాద్‌లోనే ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది.

హైదరాబాద్‌ను మరోసారి లాక్‌డౌన్‌ను విధించనన్నారా..?

కాగా, రాష్ట్రంలోని ఇతర జిల్లాల కంటే ఒక్క హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలో తీవ్రంగా నమోదు కావడంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇప్పటికే నగరంలోపలు వ్యాపార సంస్థలు స్వచ్చంధంగా లాక్‌డౌన్‌ విధిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఇక హైదరాబాద్‌ తో పాటు మేడ్చల్‌, రంగారెడ్డి పరిధిలో మళ్లీ లాక్‌డౌన్‌ విధించాలని డిమాండ్‌ పెరుగుతుండటంతో ప్రభుత్వం మరింత ఆలోచనలో పడిపోయింది. మళ్లీ లాక్‌డౌన్ విధిస్తే ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయి.. పరిస్థితుల నుంచి ఎలా గట్టెక్కాలి.. అనే అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇప్పటికే రెండు నెలల పాటు లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో సామాన్యులు, వ్యాపారులు, ప్రభుత్వం సైతం తీవ్ర నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తే ఆర్థికంగా కృంగిపోయే అవకాశాలుండటంతో లాక్‌డౌన్ విధించేందుకు ప్రభుత్వం వెనుకంజ వేస్తోంది. లాక్‌డౌన్‌ విధించడం కంటే ఎవరికి వారే జాగ్రత్తలు తీసుకుంటూ కరనా నుంచి కాపాడుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. జాగ్రత్తలు పాటించకుంటే మున్ముందు మరిన్ని కష్టాలు పడక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అయితే హైదరాబాద్‌ నగరంలో ప్రతి ప్రాంతంలో అధికంగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఎవరు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం, మాస్క్‌ లు ధరించకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడం వంటివి ప్రమాదంగా మారే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతి ఒక్కరు మాస్క్‌ లు ధరించాలని, సోషల్‌ డిస్టెన్స్‌ పాటించాలని సూచించినా పెడచెవిన పెట్టే వారు నగరంలో చాలా మంది ఉన్నారు.

Next Story