రైనాకు సీఎస్‌కే షాక్.. ఇక రీఎంట్రీ కష్టమే..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 2 Oct 2020 8:11 AM GMTచెన్నై సూపర్‌కింగ్స్ సీనియర్ ఆటగాడు, స్టార్ బ్యాట్స్‌మెన్ సురేష్ రైనా ఐపీఎల్‌లో లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. వ్యక్తిగత కారణాలతో రైనా జట్టును వీడగా.. ఇక రైనా వైపు తిరిగిచూసే ప్రసక్తేలేదని ప్రకటించి సీఎస్‌కే సీఈవో విశ్వనాథన్ సంచలనానికి తెరలేపారు.
రైనా వస్తాడా..? రాడా అన్న చర్చ జరుగుతున్న క్రమంలో.. రైనా పేరును సీఎస్‌కే అధికార వెబ్‌సైట్ నుంచి తొలగించి యాజమాన్యం మరో సంచలనానికి తెరలేపింది. రైనాతో పాటు మరో సీనియర్ ఆటగాడు హర్బజన్ సింగ్ పేరును కూడా సీఎస్‌కే వెబ్‌సైట్ నుంచి తొలగించింది. సీఎస్‌కే తాజా నిర్ణయంతో రైనా ఐపీఎల్ ఎంట్రీకి ఈ ఏడాది పూర్తిగా దారులు మూసుకుపోయాయి. నిన్న, మొన్నటి వరకు రైనా తిరిగి వస్తాడనుకున్న అభిమానుల ఆశలు కూడా అడియాశలై పోయ్యాయి.
వ్యక్తిగత కారణాల వల్ల రైనా లీగ్ నుంచి నిష్క్రమించాడని, అతను లేని లోటును రిజర్వుబెంచ్‌లోని ప్లేయర్ల ద్వారా భర్తీచేస్తామని సీఈవో అనడంతో.. రైనా రీ ఎంట్రీ ఇస్తాడని అనుకున్నారంతా.. కానీ తాజా చర్యతో రైనా రాకపై నీలినీడలు కమ్ముకున్నాయి.
ఐపీఎల్ నుంచి అర్థాంతరంగా వైదొలిగిన స్టార్ బ్యాట్స్‌మెన్ రైనాతో పాటు సీనియర్ స్పిన్నర్ హర్బజన్‌తో తమకున్న కాంట్రాక్టులను పూర్తిగా రద్దు చేసుకోవాలని సీఎస్‌కే భావిస్తున్నట్ల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చెన్నై జట్టు ఈ ఇద్దరు ఆటగాళ్లపై మరో చర్యకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది.
సీఎస్‌కే యాజమాన్యం ఇరువురి ఆటగాళ్ల ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశే దిట్టగా పేరొందిన రైనా కోసం సీఎస్‌కే ప్రస్తుత సీజన్‌లో రూ.11కోట్లు వెచ్చిస్తోంది.