చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కరోనా కలకలం.. 13 మందికి కరోనా పాజిటివ్..!
By తోట వంశీ కుమార్ Published on 28 Aug 2020 12:31 PM GMTఐపీఎల్ ప్రారంభానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కరోనా కలకలం రేపింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోని ఓ ఆటగాడితో పాటు 12 మంది సహాయ సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. బీసీసీఐ నిబంధనల ప్రకారం నిర్వహించిన ఆర్‌టీపీసీఆర్ పరీక్షల్లో వీరికి కరోనా కొవిడ్-19 సోకిందని తెలిసింది. దీంతో ఆ జట్టులో కలవరపాటు మొదలైంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సెప్టెంబర్ 19 నుంచి మొదలుకానుంది. దీని కోసం ఇప్పటికే అన్ని ఫ్రాంచైజీలు దుబాయ్‌కి చేరుకున్నాయి. నిబంధనల ప్రకారం అక్కడికి వెళ్లిన తర్వాత అన్ని జట్లు 6 రోజుల క్వారంటైన్ లో ఉండాలి. ఆ సమయంలో వారికి మూడు సార్లు కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. ఆ పరీక్షల్లో నెగెటివ్ వచ్చిన ఆటగాళ్లు మాత్రమే బయో బబులోకి వస్తారు. యూఏఈలో ఆరు రోజుల క్వారంటైన్ చెన్నై జట్టు నిన్నటితో పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో చెన్నై బృందంలోని 13 మందికి కరోనా పాజిటివ్‌గా వచ్చింది. అయితే పాజిటివ్ వచ్చిన వారందరూ విడివిడిగా ఉంటున్నారు. ఆరోగ్య అధికారుల ఆదేశాల మేరకు సిఎస్కే అన్ని భద్రతా ప్రోటోకాల్‌లను అనుసరిస్తోంది అని ఆ జట్టు యాజమాన్యం తెలిపింది. కానీ పాజిటివ్ వచ్చిన వారి వివరాలు వెల్లడించలేదు.
కాగా.. దుబాయికి రాకముందు భారత్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అధికారులు ఐదు రోజుల శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసింది. అందులో కెప్టెన్ ఎంఎస్ ధోని, సురేష్ రైనాతో సహా మరికొంతమంది పాల్గొన్నారు.