రైనా వచ్చేనా..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 27 Sep 2020 4:02 AM GMTఈ ఏడాది ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు వరుసగా రెండు ఓటములు చెందిన సంగతి తెలిసిందే..! దీంతో జట్టులో మార్పులు చేయాల్సిందే అని బయట ప్రచారం జరుగుతోంది. మొదటి మ్యాచ్ లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన అంబటి రాయుడు రెండు మ్యాచ్ లు అందుబాటులో లేకపోవడంతో భారీ ఓటములను చవి చూసింది చెన్నై జట్టు. ఇలాంటి సమయంలో సురేష్ రైనా తిరిగి జట్టులోకి రావాలంటూ అభిమానులు ఆకాంక్షిస్తూ వస్తున్నారు. ట్విట్టర్ లో మిస్టర్ ఐపీఎల్ గా పేరు తెచ్చుకున్న సురేష్ రైనా తిరిగి చెన్నై జట్టులోకి రావాలని కోరుతూ ఉన్నారు.
రైనా గురించి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సీఈఓ విశ్వనాథన్‌మాట్లాడుతూ ప్రస్తుతం మా ఫ్రాంచైజీ రైనా గురించి ఆలోచించడం లేదని అన్నారు. ఒక సీనియర్ సభ్యుడైన రైనా అందుబాటులో లేకుండా అతనే వెళ్లిపోయాడు. అతని నిర్ణయాన్ని గౌరవించాం కాబట్టే వదిలేశామని చెప్పుకొచ్చారు. తిరిగి రైనా వైపు చూసే ప్రసక్తే లేదని అన్నారు. రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయినంత మాత్రాన ఎటువంటి బెంగా లేదు. మళ్లీ మేము తిరిగి పుంజుకుంటామనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
అంబటి రాయుడు జట్టులో లేకపోవడం కూడా చెన్నై ఆట తీరుపై ప్రభావం చూపుతోంది. ఐపీఎల్‌లో వరుస ఓటములపై మహేంద్రసింగ్ ధోనీ కూడా అంబటి రాయుడు జట్టులో లేకపోవడం వల్లే ఓటమి పాలవుతున్నట్టు చెప్పాడు. తర్వాతి మ్యాచ్‌కు అతడు అందుబాటులోకి వస్తాడని చెబుతున్నాడు. రాయుడు లేకపోవడంతో జట్టులో సమతూకం దెబ్బతిందని, ఈ కారణంగానే చివరి రెండు మ్యాచుల్లోనూ ఓటమి పాలయ్యామన్నాడు.
బ్యాటింగ్ విభాగంలో కసి తగ్గడం బాధగా ఉందన్నాడు. బంతులు, పరుగుల మధ్య వ్యత్యాసం పెరిగి ఒత్తిడి పెరుగుతోందన్నాడు. తర్వాతి మ్యాచ్‌లో రాయుడు అందుబాటులోకి వస్తాడని, దీంతో జట్టు సమతూకంలోకి వచ్చి పరిస్థితి మెరుగుపడుతుందని అంటున్నాడు ధోని. రాయుడు అందుబాటులోకి వస్తే అదనపు బౌలర్‌తో ప్రయోగాలు చేసేందుకు వీలుంటుందని ధోనీ చెప్పుకొచ్చాడు.