కోలుకోని రుతురాజ్.. మరీ మూడో స్థానంలో ఎవరు ఆడనున్నారు..?
By తోట వంశీ కుమార్ Published on 15 Sep 2020 1:43 PM GMTసెప్టెంబర్ 19 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్‌లో ఢిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్.. చెన్నై సూపర్‌కింగ్స్ తలపడనున్నాయి. అయితే.. చెన్నై జట్టును ఇంకా కరోనా కష్టాలు వీడలేదు. ఆ జట్టు బ్యాట్స్ మెన్ రుతురాజ్ ఇంకా కరోనా నుంచి కోలుకోలేదు.
14 రోజులుగా క్వారంటైన్‌లో ఉండగా.. తాజాగా రుతురాజ్‌కు పరీక్షలు నిర్వహిస్తే ఇప్పటికి పాజిటివ్‌గానే వస్తోంది. దీంతో చెన్నై సందిగ్ధంలో పడింది. ఎందుకంటే ఆ జట్టు ప్రధాన ఆటగాడు సురేష్ రైనా వ్యక్తిగత కారణాలతో ఇప్పటికే స్వదేశం చేరిన విషయం తెలిసిందే. ఐపీఎల్ ప్రారంభం అయినప్పటి నుంచి రైనా ఎక్కువగా మూడో స్థానంలో ఆడుతూ జట్టుకు విజయాలు అందించాడు. రైనా లేకపోవడంతో ఆ స్థానంలో రుతురాజ్‌ను ఆడించాలని చెన్నై జట్టు నిర్ణయం తీసుకుంది.
దుబాయ్ చేరుకున్న చెన్నై జట్టులో ఇద్దరు ఆటగాళ్లు సహా 13 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. వారిని వెంటనే ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందించారు. పేసర్ దీపక్ చాహర్ త్వరగానే ఈ మహమ్మారి నుంచి కోలుకోగా.. మిగతా జట్టు సిబ్బంది కూడా కోలుకున్నారు. చాహర్ ఇప్పటికే జట్టులో కలిసి ప్రాక్టీస్ మొదలెట్టాడు. ఇంకా రుతురాజ్ కోలుకోక పోవడంతో.. మూడో స్థానంలో ఆడే ఆటగాడి కోసం వెతుకుతున్నారు.
అతడి స్థానంలో సీనియర్ ఆటగాడు అంబటి రాయుడిని ఆడించాలని జట్టు మేనేజ్‌మెంట్ బావిస్తున్నట్లు సమాచారం. అయితే.. కొంతకాలంగా అంబటి క్రికెట్‌కు దూరంగా ఉంటున్న క్రమంలో అతడు ఎంత మేరకు రాణిస్తాడో చూడాలి. రాయుడే కాకుండా మరో ఆటగాడిని కూడా ఆడించాలని చెన్నై బావిస్తోందని తెలుస్తోంది. మరీ చెన్నై తరుపున మూడో స్థానంలో బరిలోకి ఎవరు దిగుతారో తెలియాలంటే నాలుగు రోజులు ఆగక తప్పదు.