హైదరాబాద్‌లో పెరుగుతున్న కరోనా వైరస్‌ కేసులు..

By అంజి  Published on  27 Jan 2020 3:21 AM GMT
హైదరాబాద్‌లో పెరుగుతున్న కరోనా వైరస్‌ కేసులు..

హైదరాబాద్‌: ప్రపంచాన్ని కరోనా వైరస్‌ వణికిస్తోంది. ఇప్పటికే చైనాలో పెద్ద సంఖ్యలో ఈ వైరస్‌ సోకింది. పలు దేశాల్లో కూడా కరోనా వైరస్‌ కేసులు నమోదు అవుతున్నాయి. మొన్నటి వరకు స్వైన్‌ఫ్లూతో భయపడ్డ ప్రజలు ఇప్పుడు కరోనా వైరస్‌తో వణుకుతున్నారు. తాజాగా మన హైదరాబాద్‌ మహానరగంలో కూడా నలుగురికి కరోనా వైరస్‌ లక్షణాలు సోకినట్లుగా డాక్టర్లు గుర్తించారు. కరోనా వైరస్ లక్షణాలతో ఉన్న నలుగురు వ్యక్తులు ఫీవర్‌ ఆస్పత్రిలో చేరారు. ఈ నలుగురిలోని ఒకరి రక్త నమునాలను డాక్టర్లు పుణేలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపినట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. అయితే ఫీవర్‌ ఆస్పత్రిలో చేరిన నలుగురు వ్యక్తుల్లో ముగ్గురు చైనా నుంచి ఇటీవలే వచ్చారు. వీరిని ఎయిర్‌పోర్టులో సిబ్బంది స్కానింగ్‌ చేసినప్పుడు వైరల్‌ లక్షణాలు ఏమీ డిటెక్ట్‌ అవ్వలేదు. తర్వాత జ్వరం, జలుబు రావండతో ఆస్పత్రిలో జాయిన్‌ అయ్యారు.

కరోనా వైరస్‌ ప్రభావంతో వైద్య అధికారులు అప్రమత్తం అవుతున్నారు. ఇప్పటికే ఫీవర్‌ ఆస్పత్రిలో ప్రత్యేక ఐసోలేటెడ్‌ వార్డను ఏఏర్పాటు చేశామని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కె.శంకర్‌ తెలిపారు. ఫీవర్‌ ఆస్పత్రితో పాటు గాంధీ ఆస్పత్రిని నోడల్‌ కేంద్రాలుగా చికిత్సలు అందించడానికి ఏర్పాట్లు చేశారు. చైనాలోని వూహాన్ లో ఎం.బి.బి.ఎస్ చదువుతున్న ఓ విద్యార్థికి కరోనా వైరస్ సోకినట్టుగా వైద్య పరీక్షల్లో తేలింది. హైదరాబాద్ కి చెందిన ఈ విద్యార్థి చైనాలో చదువుకుంటున్నాడు. తను హైదరాబాద్ వచ్చినప్పుడు జ్వరంతో నల్లకుంటలోని ఫీవర్ ఆసుపత్రికి వెళ్లాడు. లక్షణాలనుబట్టి అది కరోనా వైరస్ అయ్యుండొచ్చన్న అనుమానంతో వైద్యులు పరీక్షలు చేయించడంతో తనకు కరోనా వైరస్ ఉన్నట్టుగా నిర్థారణ అయ్యింది. జ్వరం తగ్గడంతో సదరు వ్యక్తిని ఆసుపత్రినుంచి డిశ్చార్జ్ చేశారు.

ఫీవర్ హాస్పిటల్లో ఉన్న ఐసోలేషన్ వార్డ్ దాదాపుగా స్వైన్ ఫ్లూ వార్డ్ ని పోలి ఉంటుంది. ఈ వార్డ్ లో కేవలం ఇలాంటి ప్రాంణాంతకమైన వైరస్ సోకిని వారిని మాత్రం ఉంచుతారు. కేవలం గాలి ద్వారా ఇలాంటి వైరస్ ఇతరులకు వేగంగా సోకే ప్రమాదం ఉన్నందున ఈ వార్డ్ లో ఇతర రోగుల్ని ఎట్టి పరిస్థితిలోనూ ఉంచరు.ఈ ఐసోలేషన్ వార్డ్ లో వైద్య సేవలు అందించే వైద్య నిపుణులకు డిస్పోజబుల్ గౌన్లు, గ్లౌవ్ లు, మాస్క్ లను ఏర్పాటు చేశారు. ఇలాంటి కేసుల్ని హ్యాండిల్ చేసే వైద్యులకు, సిబ్బందికి పూర్తి స్థాయిలో అన్ని జాగ్రత్తలూ తీసుకునే విధంగా శిక్షణ ఇచ్చిన తర్వాతే ఈ వార్డ్ లో సేవలు అందించేందుకు పంపుతారు. తెలంగాణనుంచి వెళ్లిన వందలాదిమంది విద్యార్థులు చైనాలోని వూహాన్ తో పాటుగా వివిధ నగరాల్లో ఉన్న వైద్య కళాశాలల్లో ఎం.బి.బి.స్ చదువుతున్నారు. ముఖ్యంగా వూహాన్ ప్రాంతంలో కరోనా వైరస్ విస్తృతంగా ప్రబలినందుకు దాదాపుగా ఇక్కడినుంచి వెళ్లి అక్కడ చదువుకుంటున్న విద్యార్థులందరికీ ఆ వైరస్ సోకే ప్రమాదం ఉంటుంది.

Next Story