సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కేటుగాళ్ల బెదిరింపులతో నిండు ప్రాణాలు బలవుతున్నాయి. తాజాగా సైబర్ నేరగాళ్ల బెదిరింపులతో మరో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తాము అడిగినంత డబ్బులు పంపాలని, లేకపోతే తమ దగ్గర ఉన్న న్యూడ్ ఫొటోలను సోషల్ మీడియాలో పెడతామని, బంధువులకు పంపుతామని బెదిరించారు. డబ్బులు లేక అవమానభారంతో యువకుడు ఉరేసుకుని చనిపోయాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా వి.కోట అంబేద్కర్ నగర్‌లో వెలుగు చూసింది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అంబేడ్కర్‌నగర్‌కు చెందిన యువకుడు భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అతడి ఫేస్‌బుక్ అకౌంట్‌కు అందమైన యువతి చిత్రాన్ని ప్రొఫైల్ పిక్చర్‌గా ఉంచి ప్రియాశర్మ పేరిట ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపారు. దీంతో ఆ రిక్వెస్ట్‌ను యువకుడు యాక్సెప్ట్ చేశాడు. అదే అతడు చేసిన పాపమైంది. ఆ వెంటనే అతడి ఫేసుబుక్‌లోని ఫొటోలు, వీడియోలను తీసుకుని, వాటిని మార్ఫింగ్ చేసి నగ్నంగా మార్చారు. వాటిని అతడి మిత్రులు, బంధువులకు పంపుతామని చెప్పి డబ్బులు డిమాండు చేశారు. తన దగ్గర అంత డబ్బు లేదని చెప్పినా కనికరించలేదు. ఈ విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని భావించాడు ఆ యువకుడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని మరణించాడు.