తూర్పుగోదావరి జిల్లాలో ఓ యువకుడి ఆత్మహత్య తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ప్రేమికురాలి తల్లి ఫిర్యాదుతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఓ యువకుడు ఆ తర్వాత గ్రామ శివారులోని ఓ షెడ్డులో పడి ఉన్నాడు. కాగా సీఐ తీవ్రంగా కొట్టడంతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. పరిస్థితి చేయిదాటిపోవడంతో డీఎస్పీ సీఐని వీఆర్‌కు పంపారు. మృతుడి కుటుంబ సభ్యులు, బంధువుల కథనం ప్రకారం.. మండపేటకు చెందిన ప్రగడ కాళీకృష్ణ భగవాన్ (20) పాలిటెక్నిక్ పూర్తి చేసి హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే ఇటీవలి కాలంలో ఇంటి సమీపంలోనే ఉంటున్న కాళీకృష్ణ అదే గ్రామానికి చెందిన ఓ అమ్మాయితో పరిచయం పెంచుకుని ప్రేమించాడు. బాలిక తండ్రికి కాళీకృష్ణ ఆర్థిక సాయం చేసినట్లు బంధువులు తెలిపారు. అయితే కాళీకృష్ణతో కూతురుతో మాట్లాడటం చూసి తల్లి అతడిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
ఈ విషయమై మండపేట టౌన్ సీఐ దుర్గాప్రసాద్ కాళీని ఆదివారం స్టేషన్ కు పిలిపించి విచారించారు. విచారణలో యువకుడిని తీవ్రంగా కొట్టినట్లు బంధువులు తెలిపారు. మంగళవారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిన కాళీకృష్ణ షెడ్డులో పడి ఉండడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. యువకుడి మృతికి పోలీసులే కారణమంటూ మండపేట లిల్లీ సెంటర్ లో సాయంత్రం 4:30 నుంచి రాత్రి 8:30 గంటల వరకు కాళీకృష్ణ మృతదేహంతో ఆందోళనకు దిగారు. రంగంలోకి దిగిన డీఎస్పీ బాలచంద్రారెడ్డి బాధితులతో మాట్లాడేందుకు ప్రయత్నించి పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సీఐ దుర్గాప్రసాద్‌ను వీఆర్‌కు తరలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. సీఐ దుర్గాప్రసాద్, కానిస్టేబుల్, బాలిక తల్లిదండ్రులు, కళాశాల ప్రిన్సిపాల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.