హైదరాబాద్: రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో మణికొండ చిత్రపురి కాలనీలో నివసిస్తున్న 21 ఏళ్ల యూట్యూబర్ కోమలి బలవన్మరణానికి పాల్పడింది. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. విశాఖపట్నానికి చెందిన కోమలి హైదరాబాద్‌లో బీఎస్సీ చదువుతూ, చిత్రపురి కాలనీలోని బంధువుల ఇంట్లో ఉంటోంది. విశాఖపట్నానికే చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మరియు యూట్యూబర్ అయిన నిఖిల్ రెడ్డిని ఆమె ప్రేమిస్తోంది. గత కొంతకాలంగా నిఖిల్ రెడ్డి ఆమెను దూరం పెట్టేందుకు ప్రయత్నిస్తుండటంతో వీరి మధ్య విభేదాలు తలెత్తాయి.
ఆరు నెలల క్రితం కూడా కోమలి ఒకసారి ఆత్మహత్యాయత్నం చేయగా, బంధువులు నచ్చజెప్పి కాపాడారు. అయితే, ఇటీవల పెళ్లి విషయంలో వీరిద్దరి మధ్య మరోసారి తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. మనస్తాపానికి గురైన కోమలి, సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరివేసుకుని ప్రాణాలు విడిచింది. మంగళవారం ఆమె తల్లి రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నిఖిల్ రెడ్డి వేధింపుల వల్లే తన కూతురు చనిపోయిందని ఆమె ఆరోపిస్తున్నారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, నిఖిల్ రెడ్డి పాత్రపై దర్యాప్తు చేస్తున్నారు.