Hyderabad : 8 ఏళ్లుగా సహజీవనం.. వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది.
By తోట వంశీ కుమార్ Published on 25 March 2023 3:43 AM GMTఆత్మహత్య చేసుకున్న పల్లవి
అతడో మేక వన్న పులి అన్న విషయాన్ని గ్రహించలేకపోయింది. గాఢంగా ప్రేమించింది. ఇంట్లో వాళ్లను కాదని అతడితో సహజీవనానికి ఒప్పుకుంది. ఇలా ఎనిమిదేళ్లు గడిచాయి. అయితే.. అతడు మాత్రం మరో యువతిని పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యాడు. అయినప్పటికీ ఈమెతో సహజీవనం చేస్తున్నాడు. ఇటీవల అతడి వేధింపులు తీవ్రం అయ్యాయి. ప్రియుడి వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బంజారాహిల్స్ రోడ్ నం 2లోని ఇందిరానగర్‌లో ఆర్. సదానంద్ నివాసం ఉంటున్నాడు. అతడికి అదే ప్రాంతంలో నివసించే రెడపాక పల్లవి (27) తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంటూ ఎనిమిదేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. పల్లవితో సహజీవనం కొనసాగిస్తూనే సదానంత్ మరో యువతిని పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యాడు.
అయితే.. కొద్ది రోజులుగా అకారణంగా పల్లవిపై సదానంత్ దాడికి పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో పల్లవి ఈ నెల 22న తన తల్లికి ఫోన్ చేసి జరిగిన విషయాలను చెప్పింది. తనను తీవ్రంగా కొడుతున్నాడని, చనిపోవాలని, లేదంటే పుట్టింటికి వెళ్లిపోవాలని ఒత్తిడి చేస్తున్నాడని వాపోయింది. దీంతో 23న బుధవారం ఉదయాన్నే ఆమె తల్లి పెద్దపల్లి జిల్లా బొట్లవనపర్తి నుంచి హైదరాబాద్ బయలుదేరింది. ఆమె మార్గమధ్యంలో ఉండగానే సదానంద్ ఫోన్ చేసి రాత్రి పల్లవి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపాడు.
హైదరాబాద్‌కు వచ్చిన పల్లవి తల్లి కూతురు మృతదేహాన్ని చూసి బోరున విలపించింది. బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు. ఒక్క క్షణం ఆలోచించండి. రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు 040-66202000/040- 66202001.