హైదరాబాద్ నగరంలో రోజురోజుకి రోడ్డు ప్రమాదాలు పెరుగుతూ ఉన్నాయి. యువత మితిమీరిన వేగంతో వాహనాలను నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలకు కారుకులవుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా.. వాహనదారుల్లో మార్పు రావడం లేదు. ఓవర్ స్పీడ్, నిర్లక్ష్యపు డ్రైవింగ్ తో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా మాదాపూర్‌లో ఓ అమ్మాయి తన స్నేహితుడితో కలిసి సరదాగా బండిపై వెళ్తున్న సమయంలో రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందడంతో ఆ కుటుంబంలో చీకట్లు అలుముకున్నాయి. కలకత్తాకి చెందిన స్వీటీ పాండే (22) అనే అమ్మాయి తన స్నేహితుడైన రాయన్ ల్యుకేతో కలిసి వెళుతున్న సమయంలో బైక్ ఒక్కసారిగా అదుపుతప్పి హైటెక్ సిటీ ఫ్లైఓవర్‌ని ఢీ కొట్టింది. అతి వేగంగా, అజాగ్రత్తగా బైకు నడిపటంతో యాక్సిడెంట్ జరిగింది.
దీంతో బైక్ వెనక కూర్చున్న స్వీటీ పాండే ఒక్కసారిగా ఎగిరి ఫ్లైఓవర్ పై నుండి కింద పడిపోవడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. అలాగే బైక్ నడుపుతున్న రాయన్ ల్యుకేకి ఫ్లైఓవర్ గోడ తాకడంతో గాయాలయ్యాయి. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటానా స్థలానికి వచ్చారు. తీవ్ర గాయాలైన స్విటీని పోలీసులు స్థానిక హాస్పిటతల్‌కి తరలించారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ స్వీటీ మృతి చెందింది. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మాదాపూర్ పోలీసులు ఆ ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా చేసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. స్వీటీ మృతి చెందడంతో ఆమె కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు.