సర్‌ప్రైజ్ అంటూ కళ్లకు గంతలు కట్టి.. కాబోయే భర్త గొంతు కోసింది
Young woman attack on young man with knife in Anakapalle.వారిద్దరికి వివాహం నిశ్చయమైంది. కాబోయే భార్య పిలిచింది
By తోట వంశీ కుమార్ Published on 19 April 2022 8:54 AM ISTవారిద్దరికి వివాహం నిశ్చయమైంది. కాబోయే భార్య పిలిచింది కదా అని అతడు మరో ఆలోచన లేకుండా వచ్చాడు. ఇద్దరూ బైక్ పై షికారుకు వెళ్లారు. కళ్లు మూసుకుంటే సర్‌ప్రైజ్ ఇస్తానని ఆ యువతి చెప్పింది. తన చున్నీతో యువకుడి కళ్లకు గంతలు కట్టి కత్తితో అతడి గొంతు కోసింది. ప్రస్తుతం ఆ యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన అనకాపల్లి జిల్లాలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వి.మాడుగుల మండలం ఎం.కోటపాడు గ్రామానికి చెందిన అద్దెపల్లి రామునాయుడు(28) కి రావికమతానికి చెందిన వి.పుష్ప(22) తో పెళ్లి నిశ్చయమైంది. ఈ నెల 4న నిశ్చితార్థం జరుగగా.. మే 20న పెళ్లి చేయాలని ఇరు కుటుంబాల పెద్దలు నిర్ణయించారు. పీహెచ్‌డీ చేస్తున్న రామునాయుడు మూడు రోజుల క్రితమే స్వగ్రామానికి వచ్చాడు. సోమవారం ఉదయం పుష్ప ఫోన్ చేసి రావాలని కోరింది.
ఇద్దరూ కలిసి బైక్‌పై బుచ్చెయ్యపేట మండలం అమరిపురి బాబా ఆశ్రమం వద్దకు వెళ్లారు. అక్కడ కాసేపు సరదాగా గడిపారు. అనంతరం కళ్లు మూసుకుంటే సర్‌ప్రైజ్ ఇస్తానని పుష్ప చెప్పింది. దీంతో రామునాయుడు కళ్లు మూసుకున్నాడు. చున్నీతో అతడి కళ్లకు గంతలు కట్టింది. తనతో పాటు తెచ్చుకున్న కత్తితో అతడి గొంతు కోసింది. నీతో పెళ్లికి ఇష్టం లేదంటూ రోదించింది. తీవ్ర రక్తస్రావమై రక్తపుమడుగులో ఉన్న అతడిని రావికమతం ఆస్పత్రికి తీసుకువచ్చింది. బాబాగుడికి వెళ్లి తిరిగి వస్తుండగా.. ప్రమాదం జరిగిందని అందరిని నమ్మించే ప్రయత్నం చేసింది. ప్రాథమిక చికిత్స అనంతరం అతడిని అనకాపల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అతడికి ప్రాణాపాయం తప్పిందని వైద్యులు చెప్పారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.