మహిళలను, యువతులను వేధించడమే పనిగా పెట్టుకున్న ఓ ప్రబుద్ధుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నార్త్ జగన్నాథన్‌నగర్‌కు చెందిన నిందితుడు 21 ఏళ్ల దినేష్ కుమార్ ఇప్పటి వరకు 100 మంది మహిళలను వేధించినట్లు పోలీసుల ముందు అంగీకరించాడు. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని ఓ క్యాటరింగ్ కాలేజీలో చదువుతున్న నిందితుడు దినేష్ కుమార్.. కరోనా కారణంగా కాలేజీ మూసివేయడంతో చెన్నైలోని ఎగ్మోర్ ప్రాంతంలో ఓ హోటల్‌లో పని చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే రాత్రి సమయంలో, ఉదయాన్నే ఆఫీస్‌లకు వెళ్లే మహిళలను, ఒంటరిగా నడిచే మహిళలను లక్ష్యంగా చేసుకుని వేధించడం, వారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం, అసభ్యకరరీతిలో తాకడమే పనిగా పెట్టుకున్నాడు. గత వారం ఓ యువతి తన సోదరి, తండ్రి ఆర్మీ అధికారితో కలిసి మార్నింగ్ వాక్‌కు వెళ్లింది.
ఈ క్రమంలో తండ్రి వెనుకాల నడుస్తున్న యువతిని నిందితుడు దినేష్ కుమార్ అసభ్యకరరీతిలో తాకుకుంటూ బైక్‌పై పరారయ్యాడు. నిందితుడిని పట్టుకునేందుకు యువతి తండ్రి ప్రయత్నించాడు కానీ పట్టుకోలేకపోయాడు. అదే సమయంలో నిందితుడి బైక్ నంబర్‌ను నోటు చేసుకున్న యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బైక్ రిజిస్ట్రేషన్ నంబర్‌ను ట్రాక్ చేశారు. నిందితుడు ఓ హోటల్‌కి వెళ్తుండగా సీసీటీవీ రికార్డ్ అయ్యింది. తదనంతరం పోలీసులు చాకచక్యంగా నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడిపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీంతో నిందితుడు తాను ఇప్పటి వరకు 100 మంది మహిళలను వేధించానని పోలీసులకు తెలిపాడు.