హైదరాబాద్‌లో దారుణం.. పట్టపగలే యువతిపై అత్యాచారం
Young girl raped by auto driver in Hyderabad.ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినప్పటికి మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు.
By తోట వంశీ కుమార్ Published on 19 Aug 2021 8:13 AM ISTఎన్ని కఠిన చట్టాలు తెచ్చినప్పటికి మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. కామంతో కళ్లు మూసుకుపోయిన కామాంధులు రెచ్చిపోతున్నారు. పట్ట పగలు కూడా మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో పట్టపగలే దారుణం జరిగింది. పని చేసే ప్రదేశానికి వెళ్లేందుకు ఆటో ఎక్కిన యువతిపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. పట్టపగలే జరిగిన ఈ ఘటన కలకలం జరిగింది.
వివరాల్లోకి వెళితే.. సంతోష్‌నగర్‌లో ఓ యువతి(20) నివసిస్తోంది. ఆమె మైలార్‌దేవ్‌పల్లిలో ల్యాబ్ టెక్నిషియన్‌గా పనిచేస్తున్నారు. రోజు మాదిరిగానే బుధవారం కూడా ఆఫీసుకు వెళ్లేందుకు మధ్యాహ్నాం 2.30 సమయంలో సంతోష్ నగర్‌లో ఆటో ఎక్కింది. ఆ సమయంలో ఆటోలో ఆ యువతి ఒక్కతే ఉంది. ఆటో డ్రైవర్ దారి మళ్లించగా.. ఇటు ఎక్కడికి వెలుతున్నావంటూ ఆ యువతి ప్రశ్నించింది. అయితే.. ఇది దగ్గరి దారి అంటూ ఆటో డ్రైవర్ ఆ యువతిని నమ్మించాడు. అనంతరం ఆటోను ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడ యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
యువతి అపస్మారక స్థితికి చేరుకుంది. ఆమెను అక్కడే వదిలివేసి ఆటో డ్రైవర్ పరారయ్యాడు. సాయంత్రం వరకు బాధితురాలు అక్కడే ఉండిపోయింది. తరువాత తేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ యువతి ఇంకా షాక్‌లోనే ఉంది. దీంతో వివరాలు చెప్పలేకపోతుంది. ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిందా..? ఒక్కరే అఘాయిత్యానికి పాల్పడ్డాడా..? అనేది తెలుసుకునేందుకు యువతిని భరోసా కేంద్రానికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. బాధితురాలు ఆటో ఎక్కిన ప్రాంతం నుంచి ప్రధాన రహదారి, అనుసంధాన రహదారులు, నిర్మానుష్య ప్రాంతాలకు దారి తీసే చోట్ల సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఆటో డ్రైవర్లనూ విచారిస్తున్నారు.